ప్రేమకథల్ని తీయడంలో మణిరత్నంది సెపరేట్ స్కూల్. ప్రతీ సన్నివేశాన్ని పొయెటిక్‌గా… మనకు తెలిసిన ఓ జంట మన కళ్ల ముందే ప్రేమించుకొంటున్నంత అందంగా ప్రేమకథల్ని తెరపైకి తీసుకొస్తుంటారు. `గీతాంజలి` మొదలుకొని ఆయన్నుంచి గుర్తుండిపోయే ఎన్నో ప్రేమకావ్యాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇదివరకు వచ్చిన `ఓకే బంగారం` చిత్రం మణిరత్నం ఆలోచనలు ఎంత యంగ్‌గా ఉంటాయో చెప్పకనే చెప్పింది. తాజాగా మరోసారి `చెలియా` పేరుతో ప్రేమకథని తెరకెక్కించారు. మణి మరో ప్రేమకథని తీస్తున్నాడనగానే అందరి చూపూ బాక్సాఫీసుపైనే. మరి ఆ అంచనాలకి తగ్గట్టుగానే సినిమా ఉందా? మణి ప్రేమకథల్ని తెరకెక్కించడంలో మరోసారి మాస్టర్ అనిపించుకొన్నారా లేదా? తదితర విషయాలు తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే…
* కథ :
ఆఫీసర్ వరుణ్ అలియాస్ వి.సి (కార్తి) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఓ ఫైటర్ పైలట్. ఆవేశం ఎక్కువ. కానీ మనసు మాత్రం మంచిది. లీలా అబ్రహాం ఓ వైద్యురాలు. శ్రీనగర్‌లోని మిలటరీ ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరుతుంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంతో వి.సి గాయపడతాడు. ఆయనకి లీలానే వైద్యం చేస్తుంది. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. అది ప్రేమగా మారుతుంది. ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరు కావడంతో ఇద్దరి మధ్య అపార్థాలు చోటు చేసుకొంటాయి. దాంతో విడిపోతారు. అంతలో వచ్చిన యుద్ధంలో పాల్గొన్న వరుణ్ జెట్ పాకిస్థాన్ భూభాగంలో కూలిపోతుంది. దాంతో వరుణ్ రావల్పిండి జైల్లో ఖైదీగా బంధీ అవుతాడు. మరి అక్కడి నుంచి ఆయన తిరిగి బయటపడ్డాడా? లేదా? అతని కోసం లీలా ఏం చేసింది? వాళ్లిద్దరి మళ్లీ కలుసుకొన్నారా? తదితర విషయాలతో మిగతా సినిమా సాగుతుంది.
* విశ్లేషణ :
మణితర్నం మార్క్ ప్రేమకథ ఇది. కథ, కథనాల్లో పెద్దగా మలుపులేమీ ఉండవు. కానీ పాత్రల్ని తీర్చిదిద్దడంలో మాత్రం తనదైన మేజిక్‌ని మరోసారి ప్రదర్శించాడు మణిరత్నం. దాంతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. పాకిస్థాన్ జైల్లో ఖైదీగా ఉన్న వరుణ్ తన ప్రేయసితో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకొంటుంటాడు. ఆ క్రమంలోనే తన కథంతా తెరపై కనిపిస్తుంది. ప్రథమార్థం మొత్తం వరుణ్, లీలా మధ్య పరిచయం, ప్రేమ, గొడవలవంటి సన్నివేశాలతో సాగిపోతాయి. ద్వితీయార్థంలోనే అసలు మలుపులు చోటు చేసుకొంటాయి. వరుణ్ జైల్లో నుంచి బయటికి రావడం… ఆ తర్వాత లీలా గురించి వెదకడం… అదే క్రమంలోనే వరుణ్ గురించి పాకిస్థాన్ సైన్యం అన్వేషణ సాగించడం వంటి సన్నివేశాలు ఉత్కంఠని రేకెత్తిస్తాయి. ఉత్కంఠ మొదలవుతుంది కానీ… దాన్ని చివరి వరకు కొనసాగించడంలో మాత్రం మణిరత్నం విఫలమయ్యారు. యుద్ధం అనే అంశాన్ని కేవలం నేపథ్యంగా మాత్రమే ఎంచుకోవడంతో సినిమాకి కేవలం ప్రేమకథే ఆధారమైంది. అందులోనూ చెప్పుకోదగ్గ మలుపులు లేకపోవడంతో సినిమా అంతా సాదాసీదాగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ద్వితీయార్థంలో యుద్ధం నేపథ్యాన్ని ఆసరాగా చేసుకొని ఊహించని మలుపులేవైనా వస్తాయేమో అని ప్రేక్షకుడు ఆశిస్తాడు కానీ… దర్శకుడు మాత్రం ఆ వైపు ఆలోచించకుండా ప్రేమకథలోని సంఘర్షణని తెరపై చూపడం వరకే పరిమితయ్యాడు. దాంతో ఓ కన్వర్జేషన్తో సినిమా ముగుస్తుంది. అయితే ఈ సినిమా కోసం ఎంచుకొన్న నేపథ్యం, దాన్ని తెరపై చూపించిన విధానం మాత్రం చాలా బాగుంది.
* నటీనటులు… సాంకేతికత…
కార్తి, అదితి జంట ఈ సినిమాకి ప్రధాన మైనస్ అని చెప్పొచ్చు. అదితి కొన్ని సన్నివేశాల్లో ఫర్వాలేదు కానీ… కార్తిని మాత్రం చూడలేం. మాస్ పాత్రల్లో అలవాటైన ఆయన ఆఫీసర్ వి.సి పాత్రలో మీసం లేకుండా అస్సలు సెట్టవ్వలేదు. సినిమా మొత్తం ఆ రెండు పాత్రలే కీలకంగా సాగుతుంది. దాంతో మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవల్సిందేమీ లేదు. సాంకేతికంగా మాత్రం సినిమా ఉన్నతంగా ఉంటుంది. ప్రతీ సన్నివేశం ఓ దృశ్యకావ్యంలానే సాగుతుంది. రవివర్మన్ ఛాయాగ్రహణం కాశ్మీర్ అందాల్ని చాలా బాగా చూపించింది. ఎ.ఆర్.రెహ్మాన్ సన్నివేశాల్లో ఘాఢతని మరోస్థాయికి తీసుకెళ్లింది. శ్రీకర్ ప్రసాద్ తన కత్తెరకి కాస్త పదును చెప్పాల్సింది. ద్వితీయార్థంలో చాలా చోట్ల సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అయితే మణిరత్నంది పొయెటిక్ స్టోరీ టెల్లింగ్ శైలి కాబట్టి ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. మణిలో దర్శకుడు మాత్రం మరోసారి తన మేజిక్‌ని ప్రదర్శించారు.
* చివరిగా…: ప్రాణాలు పోసే ఓ వైద్యురాలికీ… ప్రాణాలు తీసే వీరుడికీ మధ్య ముడిపెట్టి తెరకెక్కించి ఓ ప్రేమకథ `చెలియా`.
తెలుగు360.కామ్ రేటింగ్ 2.75/5