ప్రజా ప్రతినిధులు ఒకరినొకరు దూషించుకోవడం విమర్శించుకోవడం సర్వసాధారణ విషయమే. కానీ ఒకరినొకరు కొట్టుకోనేంతవరకు వెళ్ళడం అరుదు. మొన్న జరిగిన మహబూబ్ నగర్ జెడ్పీ సమావేశంలో పాలమూరు ఎత్తిపోతల పధకంపై మొదలయిన చర్చ చివరకి తెరాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై చేయి చేసుకొనేవరకు వెళ్ళింది. దానికి ఆయన వెంటనే క్షమాపణ చెప్పిఉంటే సమస్య అంతటితో సద్దుమణిగేది. కానీ దళితుడినయిన తనపైన రామ్మోహన్ రెడ్డే దాడి చేశారని అందుకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెడతానని బాలరాజు బెదిరించడంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ సభ్యుడిపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు వారు మహబూబ్ నగర్ బంద్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లాలో డిపోల నుండి బస్సులు బయటకు రానీయకుండా అడ్డుకోవడంతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎక్కడా బస్సులు తిరగడం లేదు. కానీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొంటే అందుకు జిల్లా ప్రజలను మూల్యం చెల్లించమనడం బాధ్యతా రాహిత్యమేనని చెప్పకతప్పదు.