మెగా ఫ్యామిలీకి బాగా కావల్సిన దర్శకుల్లో శ్రీనువైట్ల ఒకడు. చిరంజీవి అంటే… శ్రీనువైట్లకి అమితమైన అభిమానం. ఆ ఇష్టంచూసే చిరు అప్పట్లో ‘అందరివాడు’తో అవకాశం ఇచ్చాడు.కానీ… ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తన అభిమాన కథానాయకుడ్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినా.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు శ్రీనువైట్ల. మొన్నటికి మొన్న బ్రూస్లీతో మరో ఛాన్స్ ఇచ్చాడు. కానీ… ఈసారీ శ్రీనువైట్ల వర్కవుట్ కాలేదు. ఇలా బ్యాక్ టూ బ్యాక్ రెండు ఫ్లాపులు ఇచ్చినా.. శ్రీనువైట్లపై చిరుకి అభిమానం తగ్గలేదు. అందుకే మిస్టర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో శ్రీనుని వెనకేసుకొచ్చాడు.
అందరివాడులో తమిద్దరిమధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, బ్రూస్లీలో ఓ చిన్న పాత్ర ఇచ్చి తనని అద్భుతంగా చూపించాడని పొగిడేశాడు. బ్రూస్లీలో చేసిన కామియో వల్లే మళ్లీ తాను కెమెరా ముందుకు రాగలనన్న నమ్మకం కలిగిందని చెప్పుకొచ్చాడు చిరంజీవి. సాధారణంగా ఫ్లాపు ఇచ్చిన దర్శకుల్ని హీరోలు పక్కన పెడుతుంటాడు. అందులోనూ చిరు లాంటి క్లాలిక్లేటెడ్ వ్యక్తులు ఇంకానూ. కానీ బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులిచ్చినా శ్రీనుపై నమ్మకం తగ్గలేదు. చూస్తుంటే చిరు మళ్లీ పిలిచి ఓ ఆఫర్ కట్టబెట్టేట్టే కనిపిస్తున్నాడు. చూద్దాం.. ఏం జరుగుతుందో..?