తెరాస ఎంపీ కవిత చాలా ముందుచూపుతో ఉన్నారని అనిపిస్తోంది. మంత్రి పదవిపై ఆమెకి చాలా ఆశలున్న సంగతి తెలిసిందే. కేంద్ర క్యాబినెట్ లో స్థానం కోసం సీఎం కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశారనీ అప్పట్లో కథనాలు వచ్చాయి. భాజపాతో మైత్రి పెంచుకోవడం ద్వారా కుమార్తెకు మంత్రి పదవి దక్కించుకోవచ్చని అనుకున్నారట. భాజపా రానురానూ బలపడుతూ.. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించుకుంటూ వస్తోంది. ఈ వాస్తవం కేసీఆర్ కు అర్థం కానిదేం కాదు కదా! అయితే, రాష్ట్రంలో అయినా మంత్రి పదవి నిర్వహించాలన్న కోరిక ఎంపీ కవిత బలంగా ఉందని అంటున్నారు. దానిదేముంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ తల్చుకుంటే అదేమంత పనీ! తెల్లారేసరికి ఏదో ఒక శాఖని ఇవ్వలేరా..? ఆమె కోసం త్యాగానికి సిద్ధంగా ఉన్న వారు కరువా..?
కానీ, కవిత ఆలోచన మరోలా ఉందని సమాచారం. ప్రస్తుతం ఆమె ఎంపీగా ఉన్నారు. అలాగని, ఆ పదవికి రాజీనామా చేయడం ఆమెకు ఇష్టం లేదట. అంతేకాదు.. ఎమ్మెల్సీగా చేయడం కూడా ఆమెకి ఇష్టం లేదట. నేరుగా ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఆ తరువాత మంత్రి పదవి చేపట్టాలని కవిత బలంగా నిర్ణయించుకున్నారట. సో.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కవిత నిర్ణయించుకున్నట్టే. అంతేకాదు, 2019లో ఏ స్థానం నుంచి పోటీ చేసేదీ కవిత డిసైడ్ అయ్యారనే చెప్పాలి. ఇంతకీ.. కవిత ఎంచుకున్న స్థానం ఏదంటే.. జగిత్యాల.
ఈ మధ్య కాలంలో జగిత్యాలపై ఎంపీ కవిత ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తున్నారు. అక్కడ పెండింగ్ లో ఉన్న సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లా రైతుల సమస్యలపై కవిత సత్వరం స్పందించారు. మంత్రి హరీష్ రావుతో మాట్లాడి.. సాగునీటి ప్రాజెక్టు పనుల్ని దగ్గరుండి సమీక్షించారు. మామిడి పంట ఎగుమతికి జగిత్యాల ఫేమస్. అందుకే, జగిత్యాల మామిడి బ్రాండ్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం జగిత్యాల మామిడికి తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారతానని కూడా హామీ ఇచ్చారు.
నిజానికి, కవిత ఎంపీ నియోజక వర్గ పరిధిలోకే జగిత్యాల ఎమ్మెల్యే సెగ్మెంట్ వస్తుంది. దీంతో కవితకు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపు ఈజీ అనుకుంటున్నారు. కవిత ఈ ప్రాంతంలోనే ఫోకస్ చేయడం వెనక మరో రాజకీయ వ్యూహం కూడా ఉందండోయ్. ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు జీవన్ రెడ్డి. ఆయన కూడా ఇదే నియోజక వర్గం నుంచీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో.. ఆయనకి చెక్ చెప్పాలంటే కవితను రంగంలోకి దిగడం కూడా తెరాస వ్యూహంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి, కవితక్క పక్కా వ్యూహంతో ఉన్నట్టుగా తెరాస వర్గాలు చెబుతున్నాయి.