రాజకీయ నాయకులలో ఎక్కువ మంది సిగ్గు, బిడియం, అభిమానంలాంటి వాటిని పూర్తిగా వదిలేస్తున్నట్టున్నారు. అబద్ధాలు చెప్పడమే జీవితంగా మార్చుకుంటున్నట్టున్నారు. మనస్సాక్షిని కూడా చంపేసుకున్నారో లేక మోసానికి తగ్గట్టుగా మార్చేసుకున్నారో తెలియదు మరి. అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే యువ నాయకులకు మంచి బాటను చూపించాల్సిన వృద్ధ నాయకులే పూర్తిగా విలువలకు పాతరేస్తూ ఉండడం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెప్పిన గుణపాఠమే బిజెపికి కూడా చెప్పి ఉండేవాళ్ళు సీమాంధ్ర ప్రజలు. కానీ విభజన పాపంలో కాంగ్రెస్‌తో సమాన భాగాన్ని పంచుకున్న బిజెపిని సీమాంధ్రప్రజల దృష్టిలో పునీతురాలుగా నిలబెట్టే ఓ మహా ప్రచార యజ్ఙం జరిగింది. వెంకయ్యనాయుడిలాంటి మాటల మరాఠి, చంద్రబాబు నాయుడిలాంటి ప్రచార జిమ్మిక్కుల ఘనాపాఠి, భజన మీడియా బృందం, ‘సినిమా’ చూపించడంలో అసమాన ప్రతిభ ఉన్న పవన్ కళ్యాణ్‌లు కలిసి ఆ మహా ప్రచార యజ్ఙాన్ని విజయవంతం చేశారు.
చెప్పినవన్నీ అబద్ధాలే కాబట్టి ఆచరణలో కనిపించింది శూన్యం. మూడేళ్ళలో కొత్త రాష్ట్రం ఎపిని మోడీవారు కరుణించిన విధానం చూసినవాళ్ళు ఎవ్వరూ కూడా రాబోయే రెండేళ్ళలో ఇంతకుమించిన అద్భుతాలు ఏవో జరుగుతాయని అస్సలు ఆశించరు. ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, పోలవరం, రైల్వేజోన్…ఇలా ఒక్క హామీని కూడా నెరవేర్చని పార్టీ బిజెపి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆ స్థాయిలో మోసం చేశారన్నమాట. మరి కోట్లాది మంది ప్రజలను విభజన సమయంలో ఒక సారి మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ ఘనత అనుకుంటే……విభజన సమయంలో చేసిన మోసాన్ని ప్రచార మహాయజ్ఙంతో దిగ్విజయంగా కప్పిపుచ్చి మరో ఐదేళ్ళపాటు కూడా మోసం చేయడం అంటే మాటలా? చరిత్రలో నిలిచిపోయే స్థాయి మోసం కాదా ఇది.