పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రు ఆక్వా రైతుల కష్టాలు ఎవ్వరికీ పట్టడం లేదు! మెగా ఆక్వాఫుడ్ పార్క్ నుంచి వెలువడే వ్యర్థాలతో తమ జీవితాలు ఛిద్రం అయిపోతాయంటూ ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆవేదనను అర్థం చేసుకునే నాధుడే కరువయ్యాడు. ఓ పక్క ఫ్యాక్టరీ నిర్మాణం ముందుకు సాగుతోంది. నిరసనగా ప్రజలు కూడా ఉద్యమిస్తున్నారు. కానీ, ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టుగా చెబుతున్న రాజకీయ పార్టీలు… వారి పబ్బం గడుపుకునే ప్రయత్నమే చేస్తున్నాయి. తాజాగా ప్రతిపక్ష పార్టీ వైకాపా దీనిపై స్పందించింది. ఆ ప్రాంత వైకాపా నేత నిరసనకు దిగారు. ఈ దీక్షకు ఎమ్మెల్యే రోజా కూడా మద్దతు పలికారు.
మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు విషయమై తెలుగుదేశం ప్రభుత్వం నోరెత్తకపోవడాన్ని రోజా ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలకు భారీ ఎత్తున ముడుపులు అందాయంటూ ఆమె ఆరోపించారు. ఫిరాయింపు నాయకులకు మంత్రి పదవులు ఇచ్చేందుకు సమయం కేటాయిస్తున్న చంద్రబాబుకి, తుందుర్రు ప్రజల కష్టాలు కనిపించడం లేదంటూ ఆమె విమర్శించారు. రైతులు కష్టాలు వినేందుకు ఆయనకు సమయం లేదా అంటూ నిలదీశారు. ప్రజాగళాన్ని తొక్కేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
ఇంతేనా..? ప్రతిపక్ష పార్టీగా తుందుర్రు సమస్యపై వైకాపా వైఖరి ఇదేనా! రోజా వచ్చి రొటీన్ గా విమర్శలు చేసేస్తే సరిపోతుందా..? రోజా మాటల్లో వైకాపా రాజకీయ ప్రయోజనమే వినిపిస్తోంది. అక్కడి ప్రజల కష్టాల ప్రతిధ్వని ఏదీ..? తుందుర్రులో కొంతమంది రైతులు చనిపోయారు. ఆక్వాపార్కు పేరుతో ఉద్యమిస్తున్న యువతను వివిధ కేసుల పేరుతో జైళ్లలో పెట్టారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు.. ఎమ్మెల్యే రోజా వెళ్లి, రొటీన్ గా చంద్రబాబుపై నాలుగు విమర్శలు చేసి తిరిగొచ్చేస్తే… సమస్య సాల్వ్ అయిపోతుందా..?
తుందుర్రు రైతుల కష్టాలపై పవన్ కల్యాణ్ అప్పుడెప్పుడో స్పందించారు. ఆ తరువాత, కాడె మధ్యలో దించేశారు. ఇక, ప్రతిపక్ష వైకాపా అయినా చివరి వరకూ పోరాటం చేస్తుందీ అనుకుంటే.. ఆ ఆశలు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఆ ప్రాంత ప్రజల సమస్య తీవ్రత వీళ్లకి అర్థం కావడం లేదా..? లేదంటే, ఈ ఇష్యూని పట్టుకుని వేలడాటం వల్ల పొలిటికల్ మైలేజ్ పెద్దగా వచ్చేది లేదన్న లెక్కలేసుకుంటున్నారా..? లేకుంటే.. ఇంకొన్ని రోజులు ఆగాక, సమస్య మరీ తీవ్రమౌతోందని అనిపించాలక… అప్పుడు రంగంలోకి దిగితే బాగుంటుందని వెయిట్ చేస్తున్నారా..? ప్రజల పక్షాన నిలబడం అంటే ఇదేనా..? ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఇంతేనా..?