టీఎస్ఆర్ – టీవీ 9 జాతీయ అవార్డుల ప్రదాన కార్యక్రమం కాస్తా తుస్సుమంది. వేదికపై చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు లాంటి హేమా హేమీలున్నా – ఆద్యంతం నీరసంగా సాగింది. శనివారం రాత్రి విశాఖలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది జనం తరలి వచ్చినా.. ఎక్కడా ఈ కార్యక్రమం ప్లానింగ్ ప్రకారం సాగలేదు. చివరికి రసాభసగా మిగిలిపోయింది. వేదికపై ఎవరున్నారో, ఎవరితోమాట్లాడించాలో నిర్వాహకులకు (ముఖ్యంగా సుబ్బిరామిరెడ్డికి) అవగాహన లేకుండా పోయింది. సుమ యాంకరింగ్ చేసిన ఈ షో.. తనకే అప్పగించినా బాగుండేది. మధ్యలో సుబ్బిరామిరెడ్డి మైకు పట్టుకొని.. అదేదో కూరగాయల సంతలో కష్టమర్లని పిలిచినట్టు `నువ్వు.. రా.. అవార్దు తీసుకో` అంటూ అవార్డు గ్రహీతల్ని వేదికపైకి పిలవడం కనిపించింది. ఇదేం గౌరవం? అవార్డులు ఇచ్చే తీరు ఇలానేనా? అనిపించింది.
జ్వోతి ప్రజ్వలన అనేది కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటప్పుడు చేస్తారు. అదేంటో.. పాటలు, డాన్సులు, కొన్ని అవార్డులు ఇచ్చాక.. మధ్యలో జ్యోతి వెలిగించారు. లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు అంటే.. ఎలా ఉండాలి? దాన్నీ తుస్సుమనిపించారు. మాట్లాడాల్సిన వాళ్లకు అవకాశం ఇవ్వలేదు. ఎవరెవరో, ఎందుకెందుకో మాట్లాడారు. అందరూ సుబ్బిరామిరెడ్డిని పొగడ్డానికే వచ్చారా అనిపించేలా సాగిందీ కార్యక్రమం. సరిగ్గా రాత్రి 11 గంటలకు స్టేజీపై పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమం ఆపేయాలని, ఇచ్చినటైమ్ అయిపోయిందని నిర్వాహకులతో గొడవకు దిగారు. దాంతో వేదికపై కాస్త ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. అప్పటికే గెస్టులంతా వెళ్లిపోయారు. అయితే ఇవ్వాల్సిన అవార్డులు కొన్ని మిగిలిపోయాయి. అవేం ఇవ్వకుండా.. అర్థాంతరంగా కార్యక్రమానికి శుభం కార్డు వేయాల్సివచ్చింది.
ప్రైవేటు అవార్డు ఫంక్షన్స్ ఎంతో గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఫిల్మ్ ఫేర్, సైమా, ఐఫా వేడుకలు కళ్లు మిరిమిట్లు గొలిపేలా.. చాలా పద్ధతిగా సాగుతుంటే… ఇదేంటో అస్తవ్యస్థంగా నిర్వహించారు. అంతమంది హీరోలు, హీరోయిన్లు, సినీ సెలబ్రెటీలూ కనిపించిన ఈ మల్టీస్టారర్ ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాత్రం చెప్పేయొచ్చు.