సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అత్యుత్సాహం సాక్షి ఛానల్ ప్రోత్సాహం దాని అధినేత ప్రాణానికి తెచ్చాయని గతంలో చెప్పుకున్నాం. అయితే ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సిపి అధినేత జగన్ ఈ గండం గట్టెక్కడానికి ఏం చేశారో తెలుసా? కొమ్మినేని శ్రీనివాసరావు స్వతంత్ర జర్నలిస్టుగా పనిచేస్తున్నారని వివరించారు. ఆయన చాలామందని ఇంటర్వ్యూలు చేసినట్టే మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డినీ చేశారని అందులో తన కేసుల గురించి ఒక్క ప్రశ్నమాత్రమే వున్నదని కోర్టుకు తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూ ప్రసారం తర్వాత ఆయన కేసు సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు గనక ఇచ్చిన బెయిలు రద్దు చేయాలని సిబిఐ వాదించింది. అయితే తనకు సాక్షి ఇంటర్వ్యూతో సంబంధం లేదని, దాన్ని ఇందిరా టెలివిజన్ నిర్వహిస్తుందని జగన్ తప్పించుకునే ప్రయత్నం చేశారు.
ఇక్కడ తమాషా ఏమంటే కొమ్మినేని వైఎస్ఆర్పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే కోపంతో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టివిపై ఒత్తిడి తెచ్చిఆయనను అక్కడ షో చేయకుండా అడ్డుకుంది. తర్వాత కొంతకాలానికి సాక్షిలో చేరిన కొమ్మినేని తనను తాను దాదాపు వైసీపీ మనిషిగానే పరిగణించుకుంటున్నారు. ఎక్కడకు వెళ్లినా వైసీపీ వాళ్లు తన చుట్టూ చేరుతున్నారని ఆయన వెళ్లిన వారికి ఉత్సాహంగా చెబుతుంటారు. ఆ విధంగా ఆయన జగన్ను ఓన్ చేసుకుంటే ఇప్పుడు బెయిలును కాపాడుకోవడానికి కేసునుంచి బయిటపడటానికి జగన్ కొమ్మినేని స్వతంత్ర జర్నలిస్టు అనీ ఆ ఇంటర్వ్యూతో తనకు సంబంధం లేదని చెప్పేశారు. అంతేగాని సమర్థించేందుకు సిద్దం కాలేదు. మరి ఈ పరిస్థితిని కొమ్మినేని ఎలా చూస్తారు?ఎలాగోలా ఉద్యోగం మిగిలితే సంతోషిస్తారని చెప్పొచ్చు. మరి అత్యుత్సాహం తగ్గిస్తారో లేదో మాత్రం చూడాల్సిందే.