నీతి, నిజాయితీలనేవి జీవన విధానంలో భాగం కావాలి. అంతే కానీ సినిమాటిక్‌గా ఉంది…ఉంది…ఉంది అని చెప్పి మీడియా మైకుల ముందు, బహిరంగ సభల్లోనూ బల్లగుద్దితో వచ్చేవి కాదు. బండ్ల గణేష్‌లాంటి భజన బ్యాచ్ మాటలతో వచ్చేవి అయితే అస్సలు కాదు. సినిమాల్లో పవర్ స్టార్…పాలిటిక్స్‌లో ఇంకా ఏ స్టారో తెలియని పవన్ కళ్యాణ్ నీతి, నిజాయితీలు కూడా సెకండ్ కేటగిరీకి చెందినవిగా ఉన్నాయి. ధైర్యం కూడా ఉంది….ఉంది అని చెప్పి బలంగా…నమ్మకంగా చెప్తూ ఉంటాడు పవన్. కానీ ఆయన రాజకీయాలను పరిశీలిస్తూ ఉంటే మాత్రం అంతా కూడా రొటీన్, రెగ్యులర్ ‘రాజకీయమే’ కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ న్యూస్ పేపర్లను బాగానే ఫాలో అవుతాడు. మరీ ముఖ్యంగా తనపైన వస్తున్న వార్తలను కచ్చితంగా చదువుతాడు. అలాగే రాజకీయ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు. మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకసారి ఆయన ప్రజల ముందుకు వచ్చినప్పుడు మాట్లాడే మాటలను, విమర్శకులపైన ఎదురుదాడికి దిగుతున్న విధానాన్ని పరిశీలించిన ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. మరి పొలిటికల్ అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటూ ఉన్న ఒక నాయకుడు జరుగుతున్న తప్పులు అన్నింటిపైనా స్పందించాలిగా. నిజాయితీ ఉంటే అలాగే చేయాలి. కానీ పవన్‌కి ఆ నిజాయితీ లేదు.
బిజెపి నాయకుడు ఏవో తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు మీడియాలో కనిపించిన వెంటనే పవన్ స్పందించాడు. ఉత్తర భారతదేశం-దక్షిణ భారతదేశం అంటూ అవగాహన లేని మాటలు ఏవో మాట్లాడేశాడు. మరి అదే పవన్‌కి చంద్రబాబు చేస్తున్న తప్పులు కనిపించవా? వైకాపా నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెడుతూ విలువలను పాతాళానికి తొక్కేశాడు చంద్రబాబు. ఆ విషయంపైన స్పందించాల్సిన బాధ్యత జనసేన అధినేతకు లేదా? పార్టీ ఆవిర్భావ సభలోనే జంపర్స్‌కి, జోకర్స్‌కి తన పార్టీలో చోటులేదని చెప్పి ఆవేశంగా స్పందించిన పవన్‌కి…అదే జోకర్స్, జంపర్స్‌కి చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెడుతుంటే స్పందించాల్సిన బాధ్యత లేదా? ఆ వ్యవహారం ఒక్కటే కాదు….చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఎన్నో తప్పుల విషయంలో పవన్ వ్యవహారం ఇలానే ఉంటోంది. చంద్రబాబుకు భయపడుతున్నాడో, లేక చిరంజీవి రాజకీయ పార్టీ జెండా పీకేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన బాబు భజన మీడియాకి భయపడుతున్నాడో లేక చంద్రబాబు-పవన్‌ల మధ్య వేరే డీల్స్ ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ చంద్రబాబు చేస్తున్న తప్పుల గురించి స్పందించే విషయంలో మాత్రం పవన్‌కి నిజాయితీ ఉండడంలేదు. రాజకీయ తెలివితేటలు ప్రదర్శిస్తూ మౌనంగా ఉండిపోవడమో లేక నాం కే వాస్తే అన్నట్టుగా నాలుగు మాటలు మాట్లాడి చేతులు దులిపేసుకోవడమో చేసేస్తున్నాడు.
ఇప్పుడున్న నాయకులు అందరూ చేస్తున్న రాజకీయం కూడా ఇదేగా. తమ వాడు ఎంత పెద్ద చేసినా సమర్థించడం, ఎదుటి వాడు చీమ తలకాయంత తప్పు చేసిన అరుపులు, కేకలు, పెడబొబ్బలతో రచ్చ రచ్చ చేయడం. ఇదే ఇప్పుడు నడుస్తున్న రాజకీయ ట్రెండ్. పవన్ కళ్యాణ్ ఏదో కొత్త ట్రెండ్ సెట్ చేస్తాడని ఆయన సినిమా అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు కానీ పవన్ తీరు మాత్రం ఫక్తు రొటీన్, రెగ్యులర్…సో కాల్డ్ రాజకీయ నాయకుల లాగే ఉంది. మాటల్లో మాత్రం గొప్ప గొప్ప ఆదర్శాలు వల్లించడం, చేతల్లో మాత్రం పూర్తి వ్యతిరేకంగా రాజకీయం చేస్తూ ఉండడం……‘దేవుడు పవన్’ కూడా ‘రాజకీయం’ నేర్చాడన్నమాట.