నా పిల్లల్ని పేదరికంలో చచ్చిపోనివ్వలేను కదా… ఈ మాటన్నది ఓ సాధారణ తండ్రి కాదు. ఆయనెవరో తెలుసుకునే ముందు దీనికి దారితీసిన నేపథ్యాన్ని చదవండి.
2008లో రైల్వే మంత్రిగా ఉన్న వ్యక్తికి 11మంది పిల్లలు. ఇటీవలే ఓ రెండెకరాలను పెద్ద మాల్ కట్టడానికి డెవలప్మెంట్కి ఇచ్చారు. అందులో సగభాగం కట్టే కంపెనీది. మిగిలిన సగ భాగం ఆ వ్యక్తి భార్యతో పాటు ఇద్దరు పిల్లలది. ఈ ప్రాజెక్టు ఖరీదు 500 కోట్ల రూపాయలు. దీనిమీద ప్రతిపక్షంలో ఉన్న ఓ నాయకుడు గందరగోళం చేశాడు. అంతే ఆ వ్యక్తికి కోపమొచ్చేసింది. ఏంటయ్యా ఏంటంటున్నావ్. నా పిల్లలు పేదరికంలో చచ్చిపోవాలా. వారికీ కాస్త డబ్బవసరమే కదా అని కసురుకున్నాడు. ప్రత్యర్థి చేసిన ఆరోపణ ఏంటంటే ఈ రెండెకరాలనూ ఓ కాంట్రాక్టర్ తన మేలు చేకూర్చినందుకు బహుమతిగా ఇచ్చాడని బాంబు పేల్చాడు. ఆ రైల్వే మంత్రి గారు వేరెవరో కాదు.. క్రికెట్ టీమ్ మాదిరిగా 11 మందికి జన్మనిచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్. ఆయనకు 11వ సంతానం కలిగినప్పుడు అప్పట్లో ఈనాడులో శ్రీధర్ ఓ అద్భుతమైన కార్టూన్ వేశారు. వేస్తూ అందుకిచ్చిన కామెంట్ లాలూ.. ఇక చాలు… ఆ క్రికెట్ టీమ్ మేనేజరే ఈ లాలూ ప్రసాద్ యాదవ్. గడ్డి కుంభకోణంలో ఆయనెంత గబ్బుపట్టిపోయిందీ అందరికీ తెలుసు. ఆ కేసులో శిక్ష పడిన కారణంగానే పాపం రాజకీయాల్లో మళ్ళీ పదవి చేపట్టలేకపోయారు. కానీ, సంపాదన మాత్రం మానలేదు.
హర్ష కొచ్చర్ అనే కాంట్రాక్టరుకు రాంచీ, పూరీలలో 15 ఏళ్ళ పాటు రైల్వేల ఆవరణలో రెండు హొటళ్ళను నిర్వహించడానికి లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు సాయ పడ్డారనీ, అందుకు ప్రతిగా ఆయన ఈ రెండెకరాల స్థలాన్ని లాలూ పేరిట రిజిస్టర్ చేశారనీ, బీహార్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ కిందటి వారం చెప్పడం కలకలాన్నే సృష్టించింది. దీనిపై విచారణ చేపట్టాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. దీనికి ముందు కొచ్చర్ ఈ భూమిని మరొకరికి విక్రయించారట, ప్రస్తుతం నితీశ్ మంత్రివర్గంలో ఉన్న లాలూ ఇద్దరు కుమారులు తేజ్‌ప్రతాప్, తేజస్వినీ యాదవ్, భార్య రబ్రీదేవి పేరిట మారుస్తూ రిజిస్ట్రేషన్ చేశారని మోడీ వివరణ. ఈ రెండెకరాల ఖరీదు 60 కోట్లు. ఇప్పుడు దీన్ని మాల్ ఏర్పాటుచేయడానికి ఇచ్చేశారు. బినామీ లావాదేవీల ద్వారా లాలూ గారి తనయులకు కోట్లాది రూపాయలు లబ్దిపొందేలా చేశారనీ మోడీ చెబుతున్నారు. అంతేకాకుండా ఈ తేజస్విని సిఫారసుతో ఆ భూమినుంచి మట్టి తవ్వి తీసుకెళ్లడానికి పాట్నా జూకు 44లక్షల రూపాయలు తీసుకుని మరీ ఇచ్చేశారు. పశువులకు పెట్టే గడ్డితోనే కుంభకోణానికి పాల్పడిన వాళ్లకు మట్టి అమ్ముకోవడం పెద్ద కష్టమేం కాదుకదా.
ఇంతకీ ఇప్పుడక్కడ కట్టబోతున్న మాల్ పేరు లార… లాలూలోని మొదటి అక్షరం ఆయన భార్య రబ్రీలోని తొలి అక్షరం కలిపి లార అని పేరు పెట్టేశారు. అక్కడ కూడా లాలూ తన ముద్ర పోకుండా కాపాడుకున్నారు. రెండేళ్ళుగా ప్రభుత్వంలో ఉన్పప్పటికీ, కిమ్మనని ఇప్పుడు ఈ భూమిని మాల్గా డెవలప్మెంట్కు ఇవ్వడంతో బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ సన్నాయి నొక్కులు నొక్కడం వెనుక కారణమేమిటి. ముందే దీన్ని ప్రస్తావించుంటే.. అవినీతి నిరోధానికి కట్టుబడిన ప్రధాన మంత్రి ఏదో ఒక చర్య తీసుకుని ఉండేవారే కదా. ఇంత దూరం వచ్చేశాక ఇక బేరాలాడుకోవడం తప్ప వేరే ఉపయోగముండదు. కాదంటారా. ఇలాంటివి కాకపోయినా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎన్ని చూడాల్సి వస్తుందో భవిష్యత్తులో. అన్నట్లు పిల్లలు పేదరికంలో చచ్చిపోకుండా ఉండాలంటే వందలు, వేల కోట్ల రూపాయల ఆర్జన అవసరమా లాలూ జీ.. ఇక చాలుజీ. పిల్లలు మీకే కాదు అందరికీ ఉన్నారు. సంపాదన కోసం గడ్డి కరుస్తున్న రాజకీయ నేతలకు లాలూ మాత్రం ఆదర్శం కాకూడదు.
సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి