జనార్థనరెడ్డి… భాజపాలోనే ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే, తెలుగుదేశం నుంచి భాజపాలోకి వచ్చాక.. అక్కడ ఇమడలేకపోయారు. ఆ అసంతృప్తితోనే పార్టీతో సంబంధం లేకుండా కొన్నాళ్లు వేరే వేదిక వెతుక్కున్నారు. ఈ మధ్య తెలుగుదేశం నాయకులతో కాస్త సఖ్యతగా ఉండటం ప్రారంభించారు. దీంతో సొంతగూటికి చేరతారేమో అనే సంకేతాలు ఇచ్చారు. కానీ, తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే.. భాజపా నుంచి ఆయనకి బలమైన భరోసా లభించినట్టుగా ఉంది.
కేసీఆర్ సర్కారు చేపడుతున్న ప్రాజెక్టుల్లో అవినీతి ఏరులై పారుతోందనీ, ఆధారాలు తన దగ్గర ఉన్నాయనీ, సమయం వచ్చినప్పుడు బయటపెడతానంటూ నాగం చెబుతూ ఉంటారు కదా. కానీ, ఆ ఆధారాలేంటో ఇప్పటికీ వెలుగు చూడలేదు. ఆ మధ్య కొన్ని న్యూస్ క్లిపింగ్స్ తో కోర్టుకు వెళ్తే.. అక్కడా అక్షింతలు పడ్డాయి. సో.. దీంతో ఇక కేసీఆర్ పై వ్యక్తిగత దాడికి దిగడమే కిం కర్తవ్యం అనుకున్నట్టున్నారు. సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత జయలలితకు పట్టిన గతే కేసీఆర్ కూ పడుతుందని విమర్శించారు. ఐదు రాష్ట్రాల్లో భాజపా విజయం సాధించిన దగ్గర నుంచీ కేసీఆర్ కు టెన్షన్ పెరిగిందన్నారు. వచ్చే ఇరవై నెలలపాటైనా ప్రభుత్వాన్ని సరిగా నడపగలరో లేదో అనే ఆందోళనలో ఉన్నారన్నారు.
బినామీ ఆస్తుల్ని కూడబెడుతూ, ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు కేటాయిస్తున్నారనీ, ఒకప్పుడు ఆంధ్రా కాంట్రాక్టర్లను తరిమేయాలంటూ రెచ్చిపోయిన ముఖ్యమంత్రే ఇలా మారిపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారంటూ నాగం వ్యాఖ్యానించారు. రైతుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనీ, కేసీఆర్ ప్రభుత్వం పేక మేడలో కుప్పకూలిపోయే రోజు దగ్గర్లో ఉందని తీవ్రంగా స్పందించారు.
ఇంతకీ.. ఉన్నట్టుండి నాగం ఇలా ఎందుకు రెచ్చిపోయారు..? తనకు సరైన గుర్తింపులేని పార్టీలో ఉంటున్నానని మదనపడిపోయిన నాగం, ఇప్పుడు భాజపాని ఈ రేంజిలో వెనకేసుకుని వస్తున్నారేంటీ..? ఇలాంటి అనుమానాలు సహజంగానే వస్తాయి. విశ్వసనీయ సమాచారం ఏంటంటే.. భాజపాలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందట! తెలంగాణలో బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇదీ ఒక భాగమేనని అంటున్నారు. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో నాగం జనార్థనరెడ్డికి భాజపా పెద్ద పీట వేస్తుందనే భరోసా లభించిందనే ప్రచారం జరుగుతోంది. అందుకే, ఒకేసారిగా భాజపా భావజాలాన్ని ఓన్ చేసుకున్నారని అంటున్నారు. అందుకే, నాగం వాయిస్ ఒకేసారి ఇంతగా పెరిగింది అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.