సినిమా వాళ్ల దృష్టి ఎప్పుడూ రివ్యూలపైనే ఉంటుంది. సమీక్షల వల్ల సినిమాలు నాశనమైపోతున్నాయని, చిత్రసీమకు ఇదో చీడ అంటూ.. దుమ్మెత్తిపోస్తుంటారు. రివ్యూల వల్ల లాభమేంటి?? అంటూ ప్రశ్నించేవాళ్లు ఎంతోమంది. వీళ్లలో ఇప్పుడు తమిళ కథానాయకుడు విశాల్ కూడా చేరిపోయాడు. విశాల్ అయితే.. రివ్యూలు వద్దనడం లేదు. కానీ.. ఆలస్యంగా ఇవ్వమంటున్నాడు. తొలి మూడు రోజుల వరకూ రివ్యూలేం ఇవ్వొద్దని, దాంతో సినిమాని సినిమాగా చూసే అవకాశం ప్రేక్షకులకు వస్తుందని విశాల్ అభ్యర్థిస్తున్నాడు. సినిమా విడదలై, తొలి ఆట ముగిసిన గంటలోపే రివ్యూలు బయటకు వచ్చేస్తున్నాయి. మధ్యమధ్యలో మినీ రివ్యూలు, ట్వీట్రివ్యూలు పెట్టేస్తున్నారు. విడుదలకు ముందు ప్రీ రివ్యూ అంటూ.. సినిమా భవిష్యత్తుని ముందే తేల్చేస్తున్నారు. ఇలాంటి దశలో రివ్యూలు నాలుగు రోజులు ఆలస్యంగా వస్తాయనుకోవడం అత్యాసే.
సినిమా బాగున్నప్పుడు, దానికి పాజిటీవ్ రివ్యూలు వచ్చినప్పుడు తప్పకుండా సినిమాకి ప్లస్సే అవుతుంది. ఘాజీ, పెళ్లి చూపులు సినిమాల విజయంలో రివ్యూలదీ కీలక పాత్రే.సినిమా విడుదలకు రెండు రోజుల ముందే పాత్రికేయుల కోసం షోలు వేశాయి చిత్రబృందాలు. ఆయా సినిమాలు బాగుండడంతో… పాజిటీవ్ రివ్యూలు ఇచ్చాయి. ఫలానా వెబ్సైట్ వాళ్లిచ్చిన రేటింగులు ఇవీ.. అంటూ సినిమా వాళ్లు రేటింగుల్ని పబ్లిసిటీలో వాడుకొన్నారు. పాజిటీవ్ రివ్యూలు ముందే రావాలనుకొన్నప్పుడు.. నెగిటీవ్ రివ్యూల వరకూ నాలుగు రోజులవరకూ ఆగమనడం భావ్యమా..?? సినిమా జయాపజయాల విషయంలో అంతిమ తీర్పు కచ్చితంగా ప్రేక్షకుడిదే. వాళ్లని మెప్పించే సినిమాలు తీసినప్పుడు రివ్యూల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని విశాల్ లాంటి వాళ్లు తెలుసుకొంటే మంచిదేమో..!