తాజా సమాచారం ప్రకారం సోనియాగాంధీయే మరో ఏడాదిపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతారని తెలుస్తోంది. ఈనెల 8న పార్టీ అధ్యక్ష పదవికి లాంచన ప్రాయమయిన ఎన్నికలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలలో ఆ తరువాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓడిపోవడంతో సోనియా, రాహుల్ గాంధీల ఇమేజ్ బాగా దెబ్బతింది. వారిరువురూ తమ పదవులలో నుండి తప్పుకొని పార్టీలో సీనియర్లకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినపడింది. పార్టీలో అసమ్మతి గళాలను ఏదోవిధంగా అణచివేసిన తరువాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేప్పట్టడానికి సిద్దపడ్డారు. అప్పుడు షీలా దీక్షిత్, జైరామ్ రమేష్ వంటి సీనియర్ నేతలే రాహుల్ కి ‘అంత సీన్ లేదని’ చెప్పడంతో, రాహుల్ బాగా హర్ట్ అయ్యి, ఓ రెండు నెలలు కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకి కూడా శలవు పెట్టేసి విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన అధ్యక్షపదవి చేప్పట్టడానికి పార్టీలో ఎవరూ అభ్యంతరం చెప్పరని తల్లి సోనియా గాంధీ హామీ ఇచ్చిన తరువాతనే ఆయన తిరిగి వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చేయి.
ఆ తరువాత ఆయన మోడీ ప్రభుత్వంపై చెలరేగిపోవడం చూసిన ప్రజలు, పార్టీలో నేతలు ఆయన తన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించుకొని పార్టీ అధ్యక్ష పదవి చేప్పట్టేందుకు తను అన్నివిధాల అర్హుడినని నిరూపించుకోనేందుకే హడావుడి చేస్తున్నారని అందరూ భావించారు. కానీ తీరా చేసి పార్టీ అధ్యక్ష పదవి చేప్పట్టవలసిన సమయం వచ్చేసరికి మళ్ళీ సోనియా గాంధీయే కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ మీడియాకి లీకులు ఇవ్వడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ అధ్యక్ష పదవి చేప్పట్టేందుకు రాహుల్ గాంధీ సిద్దంగాలేరని కాంగ్రెస్ చెప్పినట్లు సమాచారం. అయితే ఏకంగా ప్రధానమంత్రి పదవినే చేప్పట్టాలనుకొన్న రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షపదవి చేప్పట్టడానికి కూడా ఎందుకు జంకుతున్నారు? అటువంటప్పుడు ఇన్నాళ్ళు దాని కోసం ఎందుకు హడావుడి చేసారు? అనే ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీయే జవాబు చెప్పవలసి ఉంటుంది.