ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ కొత్తగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు ఆశించినట్టుగానే ఆయన మంత్రి అయ్యారు. ఇప్పుడు, తనకు అప్పగించిన శాఖల్లో అద్భుత విజయాలు సాధించే దిశగా అడుగులు వేయాల్సిన సందర్భం ఇది. ఈ క్రమంలో యువతను ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేష్ సిద్ధమౌతున్నారు.
రాబోయే 100 రోజుల్లో ఆంధ్రాకి ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే మూడు నెలల్లో ప్రముఖ కంపెనీలను ఏపీకి తీసుకుని రావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. విజయవాడలో ఓ సాఫ్ట్ వేర్ సంస్థ కార్యాలయం ప్రారంభించిన మంత్రి, ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని అన్నారు. వచ్చే రెండేళ్లలో ఐటీ రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసేందుకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని లోకేష్ చెప్పారు. ఆంధ్రా యువతకి ఈ గడ్డ మీదే ఉద్యోగాలు కల్పిస్తామని, రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కొత్త ఆశలు రేకెత్తించారు. వీటితోపాటు ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్, ఆటో మొబైల్స్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు.
మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత యువతను టార్గెట్ చేసుకున్నట్టున్నారు లోకేష్. వచ్చే వందరోజుల్లో పెద్ద ఎత్తున కంపెనీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తా అని ప్రకటించడం ఆసక్తికరంగా ఉంది. ఇంతకీ లోకేష్ ధీమా ఏంటో తెలీదుగానీ… గడచిన మూడేళ్లుగా సాధించిలేనిది, వంద రోజుల్లో చేసి చూపిస్తా అనడం బాగానే ఉంది. నిజానికి, బాబు వస్తే జాబు వస్తుందని గత ఎన్నికల్లో తెలుగుదేశం భారీగానే ప్రచారం చేసుకుంది. నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా బాగానే ఆకట్టుకున్నారు. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లు అవుతున్నా ఆ జోలికే వెళ్లలేదు. యువత.. ఉపాధి.. అనే టాపిక్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో యువతలో కొంత వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం.
ఇప్పుడు.. నారా లోకేష్ వ్యూహమంతా యువతను ఆకర్షించడంపైనే ఉంది! లక్షల సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయంటూ బాగానే ఆశ చూపారు. మరీ ఆ స్థాయిలో రాకపోయినా కనీసం కొన్ని వేలల్లో అయినా ఉద్యోగాలు లభిస్తే యువతకు కొంత ఊరటగా ఉంటుంది. మరి, చినబాబు టార్గెట్ అయిన రాబోయే వందరోజుల్లో ఎన్ని సంస్థలు వస్తాయో.. కొత్తగా ఎంతమందికి ఉపాధి లభిస్తుందో వేచి చూద్దాం.