కొన్నాళ్ల కిందట ముచ్చట… అప్పట్లో ప్రత్యేక హోదా ఉద్యమం ఏపీలో తీవ్రంగా సాగుతోంది. ఒక పక్క పవన్ కల్యాణ్, మరోపక్క వైకాపా, ఇతర రాజకీయ పార్టీలు.. ఇలా మూకుమ్మడిగా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాయి. భాజపా సర్కారుపై పోరాడేందుకు తమతో కలిసి రావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకీ ఆహ్వానాలు పంపాయి. అయితే, ఆ సందర్భంగా చంద్రబాబు స్పందించింది లేదు. హోదా విషయమై కేంద్రంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు మాట వరసకైనా చెప్పిందీ లేదు. ఢిల్లీ పెద్దలతో తనకు పెద్దగా పరిచయం లేదన్న రీతిలో నిమ్మకు నీరెత్తినట్టు ఉండేవారు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. తాజాగా ఓ విషయమై కేంద్రాన్ని ఒప్పించేందుకు చంద్రబాబు ఎంత చొరవ తీసుకుంటున్నారో చెప్పడం కోసం!
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ నియోజక వర్గాల సంఖ్యను పెంచుకునేందుకు చంద్రబాబు పట్టుదలతో కృషి చేస్తున్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సుజనా చౌదరీలతో కలిసి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకున్నారు. ఆంధ్రాలో నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తేవాలని అమిత్ షాను కోరారు. పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు తమవంతు ప్రయత్నం చేయాల్సిందిగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో విపక్షం వైకాపాను ధీటుగా ఎదుర్కోవాలంటే పునర్విభజన అనివార్యం అనే రేంజిలో చంద్రబాబు విన్నవించినట్టు సమాచారం.
ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడి, వైకాపా నుంచి చాలామంది నాయకుల్ని ఆకర్షించారు. వచ్చే ఎన్నికల్లో వారికి స్థానాలు కేటాయించకపోతే మొదటికే మోసం తప్పదన్నది వాస్తవం. ఇప్పటికే పార్టీలో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగలేదో.. టీడీపీకి గండమే. అందుకే, రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా.. విభజన చట్టంలో ఒక క్లాజ్ ను కాస్త సవరిస్తే చాలనీ, నియోజక వర్గాల సంఖ్య పెంచుకోవచ్చంటూ ఈ విషయంలో కేంద్రానికి కూడా చంద్రబాబు సలహాలు ఇస్తున్నారట! మొత్తానికి, ఈ విషయంలో బాగానే ప్రయత్నిస్తున్నారు. ఈ పట్టుదల ప్రత్యేక హోదా విషయంలో ఉండి ఉంటే, ఇవాళ్ల ఏపీ పరిస్థితి మరోలా ఉండేది. ప్రజల ప్రయోజనాల కంటే, పార్టీ ప్రయోజనాలకు సంబంధించి అంశాల్లోనే సీఎం స్పందన ఇలా చురుగ్గా ఉంటుందా.. అనే అనుమానం చాలామందిలో కగులుతోంది.