‘రాహుల్ అను నేను…భారతదేశ ప్రధానమంత్రిగా…’ అంటూ ప్రమాణం చేసి జాతిపిత నుంచి అప్పనంగా కొట్టేసిన గాంధీల వారసత్వాన్ని నిలబెట్టాలని రాహుల్‌గాంధీ గట్టి ప్రయత్నాలే చేశారు. ప్రేమించిన ప్రేయసితో పెళ్ళిని కూడా త్యాగం చేశాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ విభజనతో సహా ఎన్నో తొందరపాటు నిర్ణయాలను సోనియా తీసుకోవడానికి కారణం రాహుల్‌ని ప్రధాని చేయాలన్న లక్ష్యమే. 2014లో కాకపోతే ఇంకెప్పుడు అనే స్థాయిలో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ నరేంద్ర మోడీ పరిపాలనా దక్షత, పోల్ మేనేజ్మెంట్ సామర్థ్యం, ప్రచార టెక్నిక్స్ ముందు రాహుల్ బాబా నిలవలేకపోయాడు. మామూలుగానే మరుగుజ్జు నాయకుడిలా ఉండే రాహుల్…మోడీ దెబ్బకు మరీ అమూల్ బేబీ స్థాయికి పడిపోయాడు. 2014లో మోడీ ఘనవిజయం నుంచి తాజా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి విజయం వరకూ అన్నీ కూడా రాహుల్‌పైన కాంగ్రెస్ నాయకులకు ఉన్న నమ్మకాలను పూర్తిగా చంపేశాయి.
కాంగ్రెస్ నాయకులందరూ ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. రాహుల్‌గాంధీకి గాంధీ అన్న తోక ఉన్న తమ్ముడో అన్నో ఉండి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మార్పు జరిగిపోయేది కానీ రాహుల్‌కి ఉన్నది సోదరి ప్రియాంక మాత్రమే. ప్రియాంకను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ కార్యకర్తల నుంచీ నాయకుల వరకూ అందరూ కోరుకుంటున్నారు. కానీ ఒకసారి ప్రియాంక రంగంలోకి దిగితే కొన్ని దశాబ్ధాలుగా కాంగ్రెస్ గెలుపుకు కారణమవుతూ వస్తున్న ‘గాంధీ’ ట్యాగ్ ఎక్కడ పోతుందోనని సోనియాగాంధీ భయపడుతున్నట్టున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వారసులెవ్వరికీ కూడా ఆయన వారసత్వం ఉపయోగపడింది లేదు కానీ నెహ్రూ వారసులకు మాత్రం భలే కలిసొచ్చింది. బలవంతంగానైనా రాహుల్‌ని నాయకుడిగా కొనసాగించడానికే సోనియా నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం గాంధీ ట్యాగ్ తప్ప మరేమీ లేదు. ఆ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు ఇఫ్పుడు సోనియానే రాహుల్‌ని తొలగించేలా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని గెలిపించే సామర్థ్యం ఉన్న గట్టి నాయకులు కాంగ్రెస్‌లో ఉండరు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా పార్టీలో అగ్రస్థానానికి ఎదిగినా ఎప్పుడూ అభద్రతా భావంతో బ్రతుకుతూ ఉండే అధిష్టాన కుటుంబం…ఆ నాయకులను వెంటనే పార్టీ నుంచి బయటికి పంపించి వేస్తుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్‌ని గెలిపించే స్థాయి నాయకులు ఎవరూ లేరు. ఉన్నవాళ్ళంతా అధికారం సాధించలేనివాళ్ళు….కానీ అధికారానికి దూరంగా ఉండలేని వాళ్ళు మాత్రమే. ఆ అధికారం చేతికి అందాలంటే కచ్చితంగా రాహుల్‌ని తప్పించాల్సిందే. అందుకే అందరూ కలిసి రాహుల్‌ని పూర్తిగా కమెడియన్ని చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా ఉన్నారు. అప్పుడు కానీ సోనియా గాంధీ రాహుల్‌కి ‘విశ్రాంతి’ ఇవ్వదని కాంగ్రెస్ నాయకులంతా నమ్ముతున్నారు. రాహుల్ బాబు ‘రిటైర్’ అయితే తప్ప కాంగ్రెస్ బాగుపడదన్నది కాంగ్రెస్ నాయకుల గట్టి నమ్మకం. అధిష్టానం అడుగులు ఎలా ఉంటాయో చూడాలి మరి. ఏది ఏమైనా ఇండియాలో ఉన్న చాలా మంది నాయకులకంటే సమర్థుడైన మోడీకి రాహుల్ బాబా రూపంలో అంతులేని అదృష్టం కూడా కలిసి రావడం మోడీకి తిరుగులేకుండా చేస్తోంది. తాను చెడడమే కాకుండా మోడీకి ప్రత్యర్థులు అయ్యే అవకాశం ఉన్న అందరినీ చెడగొట్టడంలో రాహుల్‌ది అందె వేసిన ‘పాదం’ మరి.