అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి అయ్యారు. పదవిలోకి వచ్చిన దగ్గర నుంచీ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. నిజానికి, మంత్రి కాకముందే పార్టీలో పవర్ సెంటర్ గా లోకేష్ ఉండేవారని అంటారు..! అలాంటిది, ఇప్పుడు అధికారిక హోదాలో కూర్చున్నాక ఆగుతారా..? ప్రస్తుతం అదే మొదలైందని చెప్పాలి. తన శాఖతో సంబంధంలేని విషయాల్లో కూడా చినబాబు చొరవ ఎక్కువగా ఉంటోందని టీడీపీ నాయుకులే ఆఫ్ ద రికార్డ్ గుసగుసలాడుతున్నారు.
లోకేష్ కి దక్కింది పంచాయతీ రాజ్, ఐటీ శాఖ అనే విషయం తెలిసిందే. వచ్చే రెండేళ్లలో భారీ ఎత్తున ఐటీ ఉద్యోగాలు రాబోతున్నాయంటూ ప్రకటించిన సంగతీ తెలిసిందే. అయితే, లోకేష్ కి ఏమాత్రం సంబంధం లేని సి.ఆర్.డి.ఎ. విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు! సి.ఆర్.డి.ఎ. పరిధిలోని లే అవుట్లకు సంబంధించి మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైతే.. దాన్లో లోకేష్ పాల్గొన్నారు. ఈ ఉప సంఘంలో యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్లు ఉన్నారు. కానీ, లోకేష్ మాత్రం చొరవగా కొన్ని సూచనలూ సలహాలూ టకటకా ఇచ్చేశారట! దీంతో ఉప సంఘం సమావేశంలో ఎవ్వరూ నోరెత్తలేని పరిస్థితి..! ముఖ్యమంత్రి కుమారుడు, పైగా పార్టీ ఫ్యూచర్ అధినేత.. ఎవరైనా ఎదురు చెప్పే పరిస్థితి ఉంటుందా..? ఇది మీ శాఖ కాదు బాబూ అని అనేంత ధైర్యం ఎవ్వరికైనా ఉంటుందా..?
దీంతో మిగతా శాఖల మంత్రులకు కూడా తమ భవిష్యత్తు అర్థమైపోయిందని ఓ టీడీపీ నాయకులు అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో టీడీపీ మంత్రులూ నేతలూ చంద్రబాబు చుట్టూ తిరగడం మానేసి.. చినబాబు చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి వస్తోందని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పటికే పలువురు ఐ.ఎ.ఎస్.లను తనవైపునకు తిప్పుకున్నారనీ, బదిలీలూ కేటాయింపులూ వంటి నిర్ణయాలు తీసుకునేముందు చినబాబు పర్మిషన్ తప్పదనే ఒక ఆనవాయితీని క్రియేట్ చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో ఏదైనా జరగొచ్చనీ, ఉత్తరప్రదేశ్ రాజకీయాలను మనం ఊహించామా అంటూ మరో నేత వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా ఉంది. అయితే, ఇదంతా చంద్రబాబు ప్లాన్ ప్రకారమే జరుగుతోందా..? లేదా, చినబాబు అతి చొరవకి పోతున్నారా..? నిజానికి, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎటూ చంద్రబాబు నాయుడే ఉంటారు. లోకేష్ కు ఇంకాస్త సమయం పడుతుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ప్రస్తుతం కాస్త బలంగానే ఉంది. కానీ, చినబాబు స్పీడు చూస్తుంటే… మరో రెండేళ్లలో రెడీ అయిపోతాడనే అనిపిస్తోందని అంటున్నారు..!