ఖైదీ నెం.150 విజయోత్సాహంలో ఉన్నప్పుడే చిరంజీవి తన తదుపరి సినిమా సురేందర్‌రెడ్డితో అని ప్రకటించేశారు. పరుచూరి బ్రదర్స్ కూడా ‘ఉయ్యాల వాడ నరసింహారెడ్డి’ కథని ఎప్పుడో తయారు చేసి పెట్టారు. నిర్మాత కూడా రెడీగా ఉన్నాడు. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమా పట్టాలెక్కలేదు. కనీసం క్లాప్ కొట్టుకొంది లేదు. ఈ సినిమా ఉంటుందా? లేదంటే నరసింహారెడ్డి కంటే చిరు మరో సినిమా చేస్తాడా? అనే అనుమానాలు మొదలయ్యాయి. చివరికి తేలిందేంటంటే… ‘ఉయ్యాల వాడ నరసింహారెడ్డి’ కోసం చిరంజీవి ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడట. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతోందట.
చిరు ప్రస్తుతం గుర్రపు స్వారీ, కత్తియుద్దాలూ నేర్చుకొంటున్నాడని తెలుస్తోంది. చిరు గుర్రపు స్వారీ చేయడంలో దిట్ట. అయినా సరే… యాక్షన్ సీక్వెన్స్‌లు బాగా రావాలని.. అందులో మరింత రాటు తేలే ప్రయత్నం చేస్తున్నాడట. కత్తి యుద్దాలు ఇది వరకు చేసిన అనుభవం లేకపోవడంతో.. దానిపై చిరు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాడట. ప్రతి రోజూ ఉదయం, రాత్రి చెరో రెండు గంటలూ ఈ కసరత్తులకే సరిపోతోందని తేలింది. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి సినిమాకి సంబంధించిన కాస్ట్యూమ్స్, సెట్స్.. వీటిపై లోతైన కసరత్తులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అందుకే.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడంలో ఆలస్యం అవుతోందట. అంతే తప్ప… చిరు ఆలోచనల్లో మార్పు రాలేదని, ఆయన సురేందర్‌రెడ్డిపై, ఉయ్యాల వాడ కథపై నమ్మకంతోనే ఉన్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.