హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిన్నతనంలో ఏకసంథాగ్రాహి(ఒకసారి విన్నది మరిచిపోనివారు) అని ఆయనకు చిన్ననాడు చదువు చెప్పిన గురువు మృత్యుంజయశర్మ చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక దినపత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కేసీఆర్‌కు చిన్నప్పటినుంచి తెలుగు భాష అంటే బాగా ఇష్టమని శర్మ తెలిపారు. వ్యాకరణంగురించి రాత్రిళ్ళు వచ్చిమరీ అడిగేవాడని చెప్పారు. చిన్నప్పుడు అందరిలోకీ పొట్టిగా ఉండేవాడని, అందుకే తాను అతనిని ఆత్మీయంగా సొంతకుమారుడిలా చూసుకునేవాడినని తెలిపారు. ఏదో పద్యం అప్పజెప్పకపోతే ఒకసారి చిన్నకర్రతో కొట్టానని, అప్పటినుంచి మరింత పోటీగా చదవటం మొదలుపెట్టాడని చెప్పారు. చిన్న చిన్న పద్యాలుకూడా రాసేవాడని వెల్లడించారు. ఏకపాత్రాభినయం చేసేవాడని, బుర్రకథల్లో కథకుడిగా ఉండేందుకు ఇష్టపడేవాడని తెలిపారు. తుపాకి రాముడు, మాయల పకీరులాంటి వేషాలు వేసేవాడని, అన్ని యాక్టివిటీస్‌లో చురుకుగా పాల్గొనేవాడని చెప్పారు. అతను 8వ తరగతి చదివేరోజుల్లో సెల్ఫ్ గవర్నమెంట్ రోజు అందరూ టీచర్లవేషం వేస్తానన్నారని, చప్రాసి వేషం వేయటానికి ఎవరూ ముందుకు రాకపోతే కేసీఆర్ ముందుకొచ్చాడని తెలిపారు. తక్కువ స్థితిని తక్కువ చేయకూడదనే భావన అతనిలో అప్పటినుంచే ఉందని అన్నారు. అందుకే ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాడని శర్మ చెప్పారు. తెలంగాణ సంస్కృతిని నిలబెట్టేందుకు కృషి చేస్తున్న చంద్రశేఖరరావు తన విద్యార్థి అని చెప్పుకోవటానికి తనకు గర్వంగా ఉందని శర్మ అన్నారు.