సెలిబ్రిటీలు పదవుల్లో రాణించగలరా… ఈ చర్చ మరోసారి తెరమీదికి తెచ్చిన సందర్భం ఇది! మనదేశంలో క్రికెటర్లు, సినీతారలు ఎంతోమంది ఆరాధ్యులు. వీరికి కోట్ల మంది అభిమానులు ఉంటారు. వారి జీవితాలనే ఆదర్శంగా తీసుకునేవారూ ఉన్నారు! అయితే, ఇలాంటి వారి పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని పదవులు కట్టబెట్టడం అనేది మనం ఎప్పట్నుంచో చూస్తూనే ఉన్నాం. అయితే, పదవులు ఇవ్వడం తప్పుకాదుగానీ… ఆ పదవులు పొందాక వీరు అందిస్తున్న సేవలూ, పదవికి ఇస్తున్న గౌరవం, చిత్తశుద్ధీ ఏపాటిది అనేది ముఖ్యం. రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ తార రేఖల గురించి ఇప్పుడీ చర్చ మొదలైంది!
పార్లమెంటుకు సచిన్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ప్రశ్నలు వేసే సందర్భాలు ఇంకా తక్కువ. కోటా ప్రకారం వచ్చిన నిధులను ప్రజల కోసం ఖర్చు చేయడం మరీ తక్కువ! పార్లమెంటు సభ్యులు హాజరు, నిధుల ఖర్చులకు సంబంధించి జాబితాను తాజాగా విడుదల చేశారు. దీని ప్రకారం 348 రోజుల్లో సచిన్ సభకు హాజరైంది కేవలం 23 రోజులు మాత్రమే. మిగతా రోజులన్నీ గైర్హాజరే. నటి రేఖా హాజరీ అయితే గెస్ట్ ఎప్పీరియన్స్ మాత్రమే. కేవలం 18 రోజులే సభకు వచ్చారు. సభలో అతితక్కువ హాజరు నమోదు చేసుకున్నవారు ఈ ఇద్దరే.
ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే… సభకు రావడం తక్కువైనా, ఖర్చు విషయంలో రేఖ ఏమాత్రం తగ్గకపోవడం. ఇప్పటి వరకూ రేఖ కోసం జరిగిన ఖర్చు రూ. 65 లక్షలు కావడం విశేషం. సచిన్ కోసం రూ. 58.8 లక్షలు కావడం ఇంకో విశేషం! ఇక, ఎంపీ లాడ్స్ నిధుల వినియోగం విషయానికొస్తే… సచిన్ ఏకంగా రూ. 21.19 కోట్ల విలువైన పనుల్ని ప్రతిపాదించాడు. వాటిలో రూ. 17.65 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. రేఖాజీ అయితే కేవలం రూ. 9.28 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేయించుకున్నారు.
సో.. రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయిన ఈ తారల పనితీరు ఇలా ఉందన్నమాట! నిజానికి, మిగతావారికి వీరే ఆదర్శంగా నిలవాలి. ఈ సెలెబ్రిటీల పనితీరును ప్రజలు గమనిస్తారు. కాబట్టి, మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ, ఎంపీగా సచిన్ విధి నిర్వహణ ఇలా ఉందన్నమాట! ఏదేమైనా, సెలెబ్రిటీలకు ఇలాంటి హోదాలు కట్టబెట్టే ముందు తీవ్రంగా ఆలోచించాలనే చర్చ మళ్లీ మొదలైంది. వివిధ రంగాలకు చెందినవారికి సభలో ప్రాతినిధ్యం ఇవ్వడం తప్పు అని ఎవ్వరూ అనరు. కానీ, ఎంపీలుగా బాధ్యతలు స్వీకరించాక… ప్రజలకు జవాబుదారీగా ఉంటారనే నమ్మకం ఉన్నవారికే ఇలాంటి పదవులు ఇస్తే బాగుంటుంది కదా!