టిఆర్ఎస్ అద్యక్షుడుగా ఎవరు ఎన్నికవుతారో తెలిసినా మీరు చెబితే బాగుంటుంది.. అలాగే కెటిఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంటుగా చేస్తారని వూహగానాలు సాగుతున్నాయి నిజమేనా? అని అడిగారో విలేకరి బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియా మీట్లో. వూహలంటున్నారు కదా వూహలుగానే వుండనీయండి అంటూ దాటేశారాయన తన స్టైల్లో. పార్టీ నాయకత్వం మాట ఏమైనా కాబోయే ముఖ్యమంత్రి మాత్రం కెటిఆర్ అన్నది ఇప్పటికే స్థిరపడిపోయిన మాట. కెసిఆర్ అందుకు అందరినీ అలవాటు చేశారు కూడా.ఇటీవల ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన తర్వాత కెటిఆర్‌తో వాళ్లు గ్రూప్ ఫోటో తీసుకోవడం గమనార్హం.
ఇంతకూ కెటిఆర్ మాట తీరు, చురుకుదనం అన్నీ బాగానే వున్నాయని, ఒక విధంగా చంద్రబాబును మరపించేలా ఆయన ఐటి రంగంలో పనిచేస్తున్నారని అనుయాయులు అభిమానులు పొగుదుతున్నారు. ఇంగ్లీషు మాట్లాడ్డంలో చంద్రబాబుకు కెటిఆర్‌కు పోలికే వుండదు. పైగా ఆయనను ఎగతాళి కూడా చేశారు. దీన్నే ఎపి శాసనసభలో జగన్ ప్రస్తావించారు. ఇదంతా బాగానే వుంది గాని కెటిఆర్ లాంగ్వేజ్ బాగున్నా బాడీ లాంగ్వేజ్ అంత బాగాలేదని పరిశీలకులు అంటున్న మాట. అడుగడుగునా తన స్థానాన్ని గుర్తు చేసే రీతిలో ఆయన కదలికలు వుంటున్నాయని అంటున్నారు. అభిమానించే వారు కూడా ఈ లోపం లేకపోలేదని అంగీకరిస్తున్నారు. ఆయనకు కూడా ఎవరైనా చెవిలో వేశారో లేదో తెలియదు మరి! ఎవరైనా చెప్పినా అంత తేలిగ్గా మార్చుకోకపోవచ్చు కూడా. చూడాలి.