వైఎస్ రాజశేఖర్‌రెడ్డి-చంద్రబాబులు మంచి దోస్తులన్న విషయం సీనియర్స్ జర్నలిస్టులకు చాలా బాగా తెలుసు. బాలయ్య కాల్పుల ఎపిసోడ్ విషయంలో కూడా…కక్ష్య సాధింపులకంటే స్నేహనికే ఇంపార్టెన్స్ ఇచ్చాడు వైఎస్. బయటికి ఎలా ఉన్నా ఇంకా చాలా విషయాల్లో ఒకళ్ళకొకళ్ళు బాగానే సహకరించుకున్నారన్న మాట వాస్తవం. ఇద్దరూ మంచి సావాసగాళ్ళు అని చెప్పడానికి ఇప్పుడు కూడా బోలెడన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. సావాసదోషం ప్రభావమో…ఏమో తెలియదు కానీ ఇద్దరూ చాలా విషయాల్లో ఒకేలా ఆలోచిస్తున్నారు.
చంద్రబాబు సాక్షి పేపర్ చదువుతూ ఉన్న ఫొటో ఒకటి సాక్షి మీడియా వారికి దొరికింది. అంతే జగన్ మీడియా మొత్తం ఓ స్థాయిలో రెచ్చిపోయింది. సాక్షి చదవొద్దని అందరికీ చెప్తాడు కానీ చంద్రబాబు మాత్రం సాక్షి పత్రికనే ఫాలో అవుతాడు అనే స్థాయిలో వార్తలు వండి వార్చేసింది. మరి వైఎస్పార్ మాటేంటి అంటే జగన్ అండ్ కో ఏం సమాధానం చెప్తారో చూడాలి. వైఎస్సార్ వ్యవహారం కూడా సేం టు సేం ఇలానే ఉండేది. ఆ రెండు పత్రికలు …ఆ రెండు పత్రికలు అంటూ అస్తమానూ ఆడిపోసుకుంటూ ఉండేవాడు. కానీ స్వయానా అసెంబ్లీలోనే ఆ పత్రికలను కోట్ చేసి అడ్డంగా దొరికిపోయేవాడు. ఆ పత్రిక మీరు చదివారా అని టిడిపి నుంచి కౌంటర్స్ వచ్చేసరికి…..ఎప్పుడూ చదవను…..ఎప్పుడన్నా ఒకసారి చదువుతా అని చెప్పి కవర్ చేసుకునేవాడు. ఇప్పుడు చంద్రబాబు వ్యవహారం కూడా అలానే ఉంది.
ఇక జంపింగ్స్ జపాంగ్స్ విషయంలో కూడా చంద్రబాబు-వైఎస్‌ల తీరు ఒకేలా ఉంటుంది. 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి, టిఆర్ఎస్ల దుకాణాలను పూర్తి మూసేయాలి అనే స్థాయిలో ఫిరాయింపులను ప్రోత్సహించాడు వైఎస్. ఇంకొన్ని రోజులు వైఎస్పార్ బ్రతికి ఉండి ఉంటే అసలు టీఆర్ఎస్ పార్టీనే ఉండేది కాదు…రాష్ట్ర విభజనకు అవకాశమే ఉండేది కాదు అని ఈ రోజుకు వైకాపా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు-కెసీఆర్‌లు చేస్తోంది కూడా అదేగా. కాకపోతే రోజు రోజుకూ రాజకీయాల్లో విలువలు పాతాళం అంచులకు చేరుతున్న కాలం కాబట్టి జంపర్స్‌కి ఏకంగా మంత్రి పదవులే కట్టబెట్టాడు చంద్రబాబు.
ఇక అవినీతి వ్యవహారాలు, భూ సేకరణ వ్యవహారాలు, ప్రాజెక్టుల నిర్మాణంలాంటి విషయాల్లో 2014 నుంచీ చూస్తున్న చంద్రబాబు పాలనకు…వైఎస్ పాలనకు ఏమైనా తేడా కనిపిస్తోందా? అందుకే వైఎస్-చంద్రబాబులిద్దరూ కూడా గొప్ప సావాసగాళ్ళే. వైఎస్ నుంచి చంద్రబాబు నేర్చుకున్న ఒక పాఠం కూడా ఉంది. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ కష్టాలను కళ్ళారా చూసిన చంద్రబాబు…అలాంటి కష్టం తన పుత్రరత్నానికి రాకుండా తాను ఫాంలో ఉండగానే లోకేష్‌ని మంత్రిని…ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేసేయాలని నిర్ణయం తీసేసుకున్నాడు. కెసీఆర్ కూడా చంద్రబాబుకు జిగిరీ దోస్త్‌నే కాబట్టి ఆయన కూడా ఇవే పాఠాలు ఫాలో అవుతున్నాడు. కాకపోతే ఒక్కటే నాయకులందరూ కూడా ఆర్థికంగా…సౌకర్యాల పరంగా కూడా రోజు రోజుకూ ఎదుగుతున్నారు. కానీ ప్రజల కష్టాలు మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతూ ఉన్నాయి. కుటుంబ సంపదను, వారసులను అభివృద్ధి చేయడంలో సక్సెస్ అవుతున్న ఈ పొలిటికల్ మిత్రులు ప్రజలను అభివృద్ధి చేయడంలో మాత్రం ఎందుకు విఫలమవుతున్నట్టో?