ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంకొకరు పొలిటికల్ పులి వైఎస్ జగన్, మరొకరు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం….ముగ్గురూ కూడా లేస్తే మనిషిని కాను అనే రకం డైలాగ్స్ వినిపిస్తున్నవాళ్ళే. ఉద్యమాన్ని ఉరుకులు…పరుగులు పెట్టిస్తాం, కన్నెర్ర చేస్తాం, చించేస్తాం అని రెండు మూడేళ్ళుగా ప్రగల్భాలు పలుకుతున్నవాళ్ళే. కానీ ఉద్యమం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడింది లేదు. ఎందుకు? ప్రతి సారీ కూడా రెడ్డొచ్చె… మొదలెట్టు అన్న చందంగా ఉద్యమాలు ఎందుకు తగలడుతున్నాయి?
సమాధానం చాలా సింపుల్. వైఎస్ జగన్‌కి గానీ, పవన్‌కి గానీ, ముద్రగడకు గానీ ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చాలన్న కాంక్ష అస్సలు లేదు. తెలంగాణా ఉద్యమ సమయంలో కెసీఆర్ తీరు కూడా అలానే ఉండేది. 2014 ఎన్నికల్లో తెలంగాణాలో ఉన్న అన్ని ఎంపి సీట్లలోనూ తెరాసను గెలిపిస్తే తెలంగాణా తెస్తానని కూడా ఓ సందర్భంలో కెసీఆర్ చెప్పేశాడు కూడా. కానీ తెలంగాణా జెఎసి, ఉస్మానియా విద్యార్థులతో పాటు తెలంగాణాలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగుల దెబ్బకు దిగిరాక తప్పలేదు. వాళ్ళ ఆవేశం చూసిన కెసీఆర్ నిరాహార దీక్షను ఉపసంహరించుకునే ధైర్యం చేయలేకపోయాడు. తాను లేకపోయినా ఉధ్యమం ఉధృతంగా సాగడం ఖాయమని అర్థమయ్యే కెసీఆర్ కూడా భాగమయ్యాడు. ఉద్యమ కాక చల్లారిపోకుండా పదేళ్ళపాటు చూసినందుకు గాను క్రెడిట్ మొత్తం కెసీఆర్‌కే దక్కిందనుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్, పవన్, ముద్రగడల ఉద్యమాల పరిస్థితి కూడా సేం టు సేం. ముగ్గురు నేతలు కూడా కాపు రిజర్వేషన్స్ వచ్చేయాలని కానీ, ప్రత్యేక హోదా వచ్చేయాలని కానీ కోరుకోవడం లేదు. 2019 వరకూ వేడి చల్లారకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. పవర్ స్టార్ వారేమో తన షూటింగ్స్‌లో తాను బిజీగా ఉంటూ షాట్ గ్యాప్‌లో ట్విట్టర్లో తనకు తోచిన కామెంట్స్ అప్పుడప్పుడూ పెడుతున్నాడు. ఇప్పుడు పవన్ చేసేది ఉద్యమమే అని ఆయన అనుకుంటే….నాకు తెలిసినంత వరకూ ఈ దేశంలోనే గొప్ప ఉద్యమ కారుడు రామ్ గోపాల్ వర్మ అవుతాడనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆయనను మించి ట్విట్టర్ ఉద్యమం చేసేవారు ఇండియాలో ఇంకెవరూ లేరు మరి. ఇక ఒక వ్యూహం అంటూ లేకుండా గుడ్డిగా దూసుకెళ్ళడంలో జగన్ ఎప్పుడో మాస్టర్ డిగ్రీ సాధించేశాడు. వ్యూహాత్మకంగా వ్యవహరించే విషయంలో మాత్రం చంద్రబాబు చెప్తున్నట్టుగా జగన్ అనుభవలేమి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాపు రిజర్వేషన్స్ కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభానికి రంగస్థలం అనుభవం ఏమైనా ఉందేమో తెలియదు కానీ ఆయన వ్యవహారం అంతా కూడా డ్రమెటిక్‌గా ఉంటుంది. ఎందుకు ఆవేశపడతాడో…ఎందుకు సైలెంట్ అయిపోతాడో ఆయనకే తెలియదు. ఫైనల్‌గా వీళ్ళ ముగ్గురి టార్గెట్ కూడా ఒక్కటే. 2019 ఎన్నికల్లో ఉద్యమ వీరులుగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ముందుకు రావడం. అంతే.
ఇక తెలంగాణాలో కెసీఆర్ వెనుకడుగు వేయకుండా చేసిన పొలిటికల్ జెఎసి, ఉద్యోగుల జెఎసిలాంటివి ఎపిలో కూడా ఉన్నాయి కానీ అవన్నీ చంద్రబాబు జేబులో బొమ్మలే. ఆరడుగుల బుల్లెట్ అశోక్ బాబుతో సహా అందరూ కూడా బాబు ఎలా ఆడమంటే అలా ఆడేవాళ్ళే. చివరగా ఇంకొకరి గురించి గురించి కూడా చెప్పుకొవాలి. తెలంగాణా ఉద్యమం ఊపిరిపోసుకోవడానికి….ఉధృతమవడానికి ఎంతో కారణమైన,…కెసీఆర్ ఎప్పుడూ ఆడిపోసుకున్నట్టుగా …ఆంధ్రా మీడియా అని చెప్పుకునే ఆ మీడియా సంస్థలన్నీ కూడా పూర్తిగా చంద్రబాబు చెప్పుచేతల్లోనే ఉంటాయి. అందుకే బాబుకు ప్రత్యేక హోదా గొప్పది అనిపిస్తే….హోదా ఎంత గొప్పదో….హోదా వస్తే ఎపి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామి ఎలా అవుతుందో…మన చెవుల తప్పు వదిలే వరకూ,…హోదా గొప్పది అని అందరూ ఒప్పుకునే వరకూ చెప్తారు. అదే చంద్రబాబు హోదా వేస్ట్ అనగానే……ఛీచీ…ప్రత్యేక హోదా వేస్ట్, చెత్త, ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే అథమ స్థాయికి వెళుతుంది అని కూడా అంతే సమర్థవంతంగా చెప్తారు. ఉద్యమ వీరులు అని చెప్పుకుంటున్నవాళ్ళేమో 2019 ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నారు. మిగతా బాబు బ్యాచ్ అందరూ కూడా బాబునే ఫాలో అవుతున్నారు. అందుకే ఈ ఐదేళ్ళూ మాత్రం ఆంధ్రప్రదేశ్‌కి పూర్తిగా నష్టం జరిగింది…జరుగుతూ ఉంది….జరగబోతోంది అని చెప్పడానికి సందేహం అవసరం లేదు.