హైదరాబాద్: వినాయక చవితి వస్తుందంటే చాలు… భాగ్యనగరంలోని వీధి వీధీలో, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలో సంరంభం మొదలవుతుంది. వినాయక పందిళ్ళ సన్నాహాలు ప్రారంభమవుతాయి. బొజ్జగణపయ్య విగ్రహాల విక్రయాలు ఊపందుకుంటాయి. అరఅడుగు సైజునుంచి అరవై అడుగుల విగ్రహాలవరకు పందిళ్ళలో ప్రతిష్ఠంపజేస్తుంటారు. అయితే విగ్రహాలకోసం వెతుక్కుంటూ మార్కెట్‌కు వెళ్ళాల్సిన అవసరంలేకుండా ఇప్పుడు ఆన్లైన్లోనే వినాయక విగ్రహాలు విక్రయిస్తున్నారు. విభిన్న సైజులు, రంగులు, డిజైన్లతోబాటు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనుసైతం సిద్ధంగా పెడుతున్నారు. ఆన్లైన్లో వెబ్సైట్లో ఉన్న విగ్రహాలలో నచ్చినది బుక్ చేసుకుంటేచాలు నేరుగా ఇంటికే డెలివరీ చేసేస్తున్నారు. వినాయక విగ్రహాలను ఆన్లైన్లో విక్రయించటం నగరంలో ఇదే తొలిసారి. నగరానికి చెందిన నూర్ అనే ముస్లిమ్, గణేష్ విగ్రహాల విక్రయాల కోసం onlineganesh.in అనే ఈ కామర్స్ వెబ్సైట్ ప్రారంభించటం విశేషం. మార్కెట్ ధరకంటే తక్కువ ధరకే విగ్రహాలను అందిస్తునని నూర్ చెబుతున్నారు. అంతేకాదు… డెలివరీ చేసేటపుడు మార్గమధ్యంలో ఎలాంటి డేమేజ్ జరిగినా కొత్త విగ్రహాలను అందిస్తామంటున్నారు. ఆన్లైన్ విగ్రహాల విక్రయాలంటే చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే కాదని, మూడు అడుగులనుంచి 12 అడుగులసైజు వరకు విగ్రహాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. త్వరలో బెంగళూరు, చెన్నై, ముంబాయి తదితర నగరాలకు విస్తరిస్తామని అంటున్నారు.