రాజకీయాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ ది అతిథి పాత్ర అని ఓ విమర్శ ఉంది! ఆ విమర్శకు తగ్గట్టుగానే పవన్ స్పందన కూడా ఉంటుందనుకోండి..! అప్పుడెప్పుడో.. రాజధాని భూసేకరణ అంశమై పవన్ కల్యాణ్ స్పందించిన సంగతి తెలిసిందే. తమ అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతపు భూసేకరణ చేస్తున్నారంటూ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొంతమంది రైతులు ఆవదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అలాంటి ఆవేదనే మళ్లీ వినిపిస్తోంది.
ఏపీ సర్కారు తమను మళ్లీ వేధించడం మొదలుపెట్టిందంటూ పెనుమాక, ఉండవల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లో బలవంతపు భూసేకరణ ఆపాలంటూ ఏపీ సర్కారుకు విజ్ఙప్తి చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు పట్టుకుని ధర్నాకి దిగడం విశేషం. తమ భూములకు రక్షణగా ఉంటానంటూ గతంలో పవన్ కల్యాణ్ మాట ఇచ్చారనీ, ఆ హామీకి కట్టుబడి తమ తరఫున పోరాటం చేయాల్సిందిగా ఓ లేఖ ద్వారా కోరారు. రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణను సహించలేననీ, ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే తాను ధర్నాకు దిగుతానంటూ గతంలో పవన్ చెప్పారని రైతులు ఈ లేఖలో మరోసారి గుర్తు చేశారు.
సో.. రాజధాని ప్రాంత రైతులకు పవన్ ఇచ్చిన మాట ఇంకా గుర్తుంది. కానీ, పవన్ కల్యాణ్ కు ఈ రైతులు గుర్తున్నారా అనేది ప్రశ్న..? అప్పట్లో భూసేకరణ అంశం వివాదాస్పదం కాగానే.. రాజధాని ప్రాంత గ్రామాలకు హుటాహుటిన వెళ్లారు. రైతుల మధ్యలో కూర్చుని, వాళ్ల ఆవేదన విన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగింది. భూసేకరణ నోటిఫికేషన్ ను తాత్కాలికంగా నాడు రద్దు చేసింది. అంతేకాదు… పవన్ కల్యాణ్ తో ఇదే అంశమై ముఖ్యమంత్రి చర్చిస్తారనీ నాడు అన్నారు.
కానీ, ఆ తరువాత పవన్ – చంద్రబాబు భేటీ జరగలేదు. భూసేకరణ అంశమై పవన్ తో చంద్రబాబు మాట్లాడిందీ లేదు. ఎందుకు స్పందించడం లేదని చంద్రబాబును పవన్ ప్రశ్నించిందీ లేదు..! కనీసం ఇప్పటికైనా తమ ఆవేదనను పవన్ అర్థం చేసుకుంటారేమో అనే ఆశతో రైతులున్నారు. అందుకే, ఇప్పటికీ పవన్ కల్యాణ్ ఫొటోపెట్టుకుని ధర్నా చేస్తున్నారు. ఆ రైతుల గోడును అర్థం చేసుకునేవారు ఎవరున్నారనీ..? అందుకే, ఇప్పటికీ పవన్ మీదే వాళ్ల ఆశలు. మరి, ఈ రైతుల ఆవేదన పవన్ కల్యాణ్ కి వినిపిస్తుందా..? కనీసం ఒక్క ట్వీటైనా రాస్తారా..? వీలైతే ఓ ప్రెస్ మీటైనా పెడతారా..? ఇంతే కదా జనసేన పోరాట పంథా..!