మాస్ కథలకి తెలివిగా కామెడీని జోడిస్తూ ఓ ప్రత్యేకమైన ఫార్మాట్లో సినిమాలు తీస్తుంటారు శ్రీనువైట్ల. ఆ కథలకి సెపరేట్‌గా శ్రీనువైట్ల ఫార్ములా అనే ఓ పేరు కూడా పడింది. ఆ ఫార్ములాతోనే ఎంతోమంది అగ్ర కథానాయకులకి హిట్లిచ్చిన ఆయన ఇటీవల పరాజయాల్ని ఎదుర్కొంటున్నాడు. మరో కొత్త ఫార్ములాలోకి అడుగుపెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. వరుణ్‌తేజ్ కూడా కమర్షియల్ ఫార్మాట్లో సినిమాలు చేసి మాస్ హీరో అనిపించుకొనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ ఇద్దరి కలయికలోనే `మిస్టర్` తెరకెక్కింది. మరి ఈ సినిమా ఇద్దరి కలల్ని ఎంతవరకు నెరవేర్చిందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే…
* కథ
చై (వరుణ్ తేజ్) స్పెయిన్‌లో స్థిరపడ్డ ఓ తెలుగు వ్యాపారి కొడుకు. అనుకోకుండా స్పెయిన్‌లోనే మీరా వెల్లంకి (హెబ్బా)ని తన ఇంటికి తీసుకొస్తాడు. ఆమెని చూడగానే ప్రేమలో పడిపోతాడు. మీరా కూడా చై మంచి మనసుని ఇష్టపడుతుంది. ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. నాలుగు రోజులు తన ఇంట్లోనే ఉన్న మీరాకి తన ప్రేమ విషయం చెప్పాలనుకొనేసరికి, ఆమే తాను సిద్ధార్థ్ (ప్రిన్స్)ని ప్రేమించానని చెబుతుంది. దాంతో చై వెనక్కి తగ్గుతాడు. అయితే ఇండియాకి తిరిగొచ్చిన మీరాకి తన ప్రేమ విషయంలో ఓ సమస్య ఏర్పడిందని చెబుతుంది. ఇష్టమైన వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్లే చై వెంటనే ఇండియాలో వాలిపోతాడు. మరి మీరా ప్రేమకి ఏర్పడిన సమస్య ఏంటి? దాన్ని ఎలా పరిష్కరించాడు? ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ఓ రాజ వంశీయులకి చెందిన చంద్రముఖి (లావణ్య) అనే అమ్మాయి చైని ఎలా కలిసింది? ఆమెకి ఎదురైన సమస్యని చై ఎలా పరిష్కరించాడు? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
* విశ్లేషణ
పదేళ్లుగా ఒకటే ఫార్ములాతోనే సినిమాలు తీస్తున్నారు శ్రీనువైట్ల. ఆయనతో పాటు ఇతర దర్శకులు కూడా ఆ ఫార్ములాతో తరచుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. దాంతో ప్రేక్షకులకు ఆ కథలు బాగా బోర్ కొట్టేశాయి. అందుకే ఇప్పుడు శ్రీనువైట్ల మరో దారిని ఎంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా చేసిన ఓ చిత్రమే `మిస్టర్`. అయితే శ్రీనువైట్లకి మాత్రం తన పాత సినిమాల వాసనలు అస్సలు దూరం కాలేదు. అదే కథ, అదే కథనం, ఆవే కామెడీ సన్నివేశాలు. ఈసారి ఆయన చేసిన మరో ప్రయత్నం ఏంటంటే తన మార్క్ రొటీన్ కథ, కథనాల్ని మరికాస్త పెద్దదిగా చేసి చెప్పడం. దాంతో ప్రేక్షకులకి తొలి సగభాగంలో రెండు ఫ్లాప్ సినిమాలు, మలిసగభాగంలో మరో రెండు ఫ్లాప్ సినిమాలు చూసినట్టుగా ఉంటుంది. కొత్త కథ రాసుకొంటే కొత్త సినిమా సిద్ధమవుతుంది తప్ప, పాత కథలు రెండు మూడింటిని కలిపి ఓ సినిమాలో చూపిస్తే అది కొత్త సినిమా ఎలా అవుతుందో శ్రీనువైట్లకే తెలియాలి. ఎక్కడో ఓ కథని మొదలుపెట్టి, ఇంకెక్కడో మరికొన్ని కథల్ని కలుపుకొని, ఆ తర్వాత మళ్లీ పాత కథలోకి వచ్చి సినిమాని ముగించేస్తాడు శ్రీనువైట్ల. దాంతో ప్రేక్షకుడికి అనవస గందరగోళం తప్ప ఎక్కడా వినోదాన్ని ఆస్వాదించలేడు. పోనీ ఆ కథల్లోనైనా కొత్తదనం ఉందా అంటే అదీలేదు. ప్రతీ సన్నివేశం పరమ రొటీన్. శ్రీనువైట్ల సినిమాల్లోనే నాలుగైదుసార్లు ఆ సన్నివేశాల్ని, ఆ నేపథ్యాల్ని చూసుంటాం.
ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నఓ గ్రామానికి చెందిన పెద్ద మనిషి పిచ్చయ్యనాయుడు (నాజర్) నేపథ్యంలో కథ మొదలవుతుంది. ఆయన్ని దెబ్బకొట్టి ఆ ఊరినీ,చుట్టూ ఉన్న అడవిని సొంతం చేసుకోవాలని శత్రువులు కుట్ర పన్నుతారు. ఆ కథ తిన్నగా ముందుకు నడుస్తుందని ఊహిస్తే, అంతలోనే కథ స్పెయిన్‌కి వెళుతుంది. అక్కడ చైని కలుపుకొనిమళ్లీ ఇండియాకి తిరిగిస్తుంది. ఆ తర్వాత కథానాయికలకున్న ఒకొక్క కథని కలుపుకొని అప్పుడు పిచ్చయ్యనాయుడు ఊళ్లోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రహసనమంతా తలనొప్పి వ్యవహారం అనిపిస్తుంది తప్ప,అందులో కొత్తదనం మచ్చుకైనా కనిపించదు. బోలెడన్ని పాత్రలు పరిచయమవుతూ, బోలెడన్ని మలుపులు చోటు చేసుకొంటూ కథ ముందుకు సాగుతున్నా ఏ దశలోనూ సినిమా రక్తికట్టదంటే ఆ సన్నివేశాల్లో కొత్తదనం ఏపాటిదో అర్థంచేసుకోవచ్చు. కామెడీ కోసమని స్పూఫ్‌లు, రియల్ క్యారెక్టర్లు, కన్ఫ్యూజన్ కామెడీ… ఇలా చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ ఎక్కడా కామెడీ పండలేదు.
* నటీనటులు… సాంకేతికత
ఈ సినిమా చూడాలనిపించే విషయమేదైనా ఉందంటే అది సాంకేతికత, నటీనటులే. గుహన్ కెమెరా పనితనం చాలాబాగుంది. స్పెయిన్ అందాల్నిచాలా బాగా చూపెట్టింది. మిక్కీ సంగీతం కూడా ఫర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ప్రతి సన్నివేశం చూడ్డానికి ఎంతో నాణ్యంగా ఉంటుంది. దర్శకుడిగా మాత్రం శ్రీనువైట్ల మరోసారి ఫెయిలయ్యారు. కథల్ని పూర్తిగా మార్చితే తప్ప ఆయన పాత సినిమాల ప్రభావం నుంచి బయటికిరాలేడనే విషయం ఈ సినిమాతో మరోసారి స్పష్టమైంది. నటీనటులు అందరూ బాగా చేశారు. సన్నివేశాలు పండలేదు కానీ… నటీనటుల ప్రయత్నాన్నిమాత్రం అభినందించాల్సిందే. కామెడీ, భావోద్వేగాల్లో తన శక్తిమేరకు నటించేప్రయత్నంచేశాడు వరుణ్. హెబ్బా, లావణ్య త్రిపాఠిలకి కూడా మంచి పాత్రలు దక్కాయి. కామెడీ గ్యాంగ్ చాలాపెద్దదే ఉంది. వాళ్లంతాపాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
* ఫైనల్‌గా – కొత్తదనం కొరవడిన ఈ `మిస్టర్`, ఒకప్పుడు అసలు సిసలు మాస్ సినిమాకి మాస్టర్ అనిపించుకొన్న దర్శకుడు శ్రీనువైట్లని అప్డేట్ అవ్వమని మరో గట్టి సంకేతాన్నిస్తాడు.
తెలుగు360.కామ్ రేటింగ్ 2.75/5