పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.. వెనకటికి పెద్దలు చెప్పినమాట! మొక్కై వంగనిది మానై వంగునా.. ఇది కూడా పెద్దలు చెప్పిన మాటే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేష్ విషయంలో ఈ రెండూ వర్తిస్తాయని చెప్పాలి! చినబాబు అంటే బాగా ప్రేమ ఉన్నవాళ్లు మొదటి మాట అనుకుంటున్నారు. కొంతమంది సీనియర్లు… గౌరవం పొందలేకపోతున్నవాళ్లు రెండో మాట అన్వయిస్తున్నారు. ఇప్పుడు టీడీపీలో మొదలైన చర్చ.. చినబాబులోని రెండో యాంగిల్ గురించే..!
మంత్రి అయ్యాక లోకేష్ బాబు బాగా బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. సీనియర్ మంత్రుల కంటే కూడా చాలా స్పీడుగా దూసుకెళ్తున్నారు. తనకు కేటాయించిన పనులతోపాటు, కేటాయించనవాటిలో కూడా చురుగ్గా ఉంటున్నారు! సి.ఆర్.డి.ఎ. పరిధితోపాటు వివిధ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని లే అవుట్ల విషయంలో మంత్రులు యనమల, నారాయణల కంటే ఎక్కువ పాత్ర పోషించేశారు. ఇది దూసుకుపోవడం అనుకోవాలా… లేదంటే, సీనియర్లను పట్టించుకోకపోవడం అనుకోవాలా..? మరి, ఇంత బిజీగా ఉంటున్న చినబాబును కలవాలంటే అపాయింట్మెంట్ దొరకడం అంత సులువా..? సాధారణ జనాల సంగతి పక్కన పెడితే.. కనీసం తోటి మంత్రులకు కూడా లోకేష్ అపాయింట్మెంట్ దొరకడం గగనంగా మారుతోందట. పోనీ.. నేరుగా ఛాంబర్ కి వచ్చి కలుద్దామని అనుకున్నా… చినబాబు అస్సలు పట్టించుకోవడం లేదట!
కొత్త ఎక్సైజ్ మంత్రిగా జవహర్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అంతకుముందు, చినబాబు లోకేష్ ను కలిసేందుకు ఆయన వెళ్లారట. అంతే, గంటల కొద్దీ ఆయన్ని వెయిటింగ్ లో ఉంచారు. కనీసం ఛాంబర్ లోకి పిలిచి, కాసేపు కూర్చోండని కూడా ఎవ్వరూ అనలేదట. సాధారణ సందర్శకులు వెయిటింగ్ చేసే హాల్లోనే జవహర్ ను చాలాసేపు ఉంచేశారు. ఇప్పుడీ ఉదంతం తెలుగుదేశం వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. మంత్రి పదవి చేపట్టిన కొద్దిరోజులకే చినబాబు పనితీరు ఇలా ఉంటే.. మున్ముందు ఎలాంటి పరిస్థితిలు ఉంటాయో అని టీడీపీ నేతలే కొంతమంది వాపోతున్నారట!
నిజానికి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోజుల్లోనే లోకేష్ ఇలా వ్యవహరించిన సందర్భాలున్నాయి. సీనియర్లు లోకేష్ ను కలవాలంటే.. అప్పట్లోనే ఓ రేంజిలో అప్రకటిత ప్రోటోకాల్ ఉండేది. చినబాబు తీరుపై అప్పట్లోనే కొన్ని అవాకులూ చవాకులూ వినిపించేవి. సో.. ఇప్పుడు సహచర మంత్రులతో చినబాబు వ్యవహరించే తీరు ఇలా ఉంటోందని చెప్పక తప్పడం లేదు. మర్యాద పూర్వకంగా కలవడానికి వెళ్తేనే.. ఇంత సమయం పట్టిందంటే, ఇక ఏదైనా పనిమీద వెళ్తే ఎలా రెస్పాండ్ అవుతారో ఏంటో అని కొంతమంది టీడీపీ నేతలే వాపోతున్నారు