ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు సిద్ధమైపోతున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. ఇంచుమించుగా మూడేళ్ళ తరవాత మంత్రివర్గ విస్తరణ, వివాదాలలో ఇరుక్కున్న వారికి ఉద్వాసన, తనకు ఎంతో దగ్గరవారిని సైతం మంత్రివర్గం నుంచి తప్పించడానికి వెనుకాడకపోవడం, విజయవాడ ఎంపీ కేశినాని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావుతో రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌కు క్షమాపణలు చెప్పించడం, తాజాగా తనను కలవడానికి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు అవకాశమీయడం వంటి అంశాలు దీన్నే సూచిస్తున్నాయి. విభజన అంశాలను ఒక కొలిక్కి తెచ్చేందుకు చంద్రశేఖరరావుతో భేటీకి సిద్ధమవుతుండడం ఇందులో కీలకమైన అంశం. ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తే తప్ప వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టోకు సరంజామా సమకూరదని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడో గ్రహించారు. ఇంతవరకూ బాగానే ఉన్న ఓటుకు నోటు వంటి సమస్యలు ఇద్దరికీ అడ్డుగోడగా నిలుస్తూ వచ్చాయి. ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ చొరవతో ఆయన సమక్షంలోనే సమావేశం కావాలని వారు నిర్ణయించుకున్నారు. ఆదివారం ఈ భేటీలో ఇద్దరికీ మధ్య సామరస్యపూర్వక వాతావరణం నెలకొనే వాతావరణమే ప్రస్తుతానికి కనిపిస్తోంది.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించకూడదని తొలుత భావించినప్పటికీ, ఆయన హఠాన్మరణంతో కుమార్తె అఖిల ప్రియకు పదవి ఇవ్వక తప్పలేదు. తాననుకున్నదే చేసే చంద్రబాబుకు తప్పని సరైతే ఆగర్భశత్రువునైనా కౌగలించుకుని సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్‌లో ఉన్న భూమానూ, ఆయన కుమార్తెనూ రారమ్మని పిలిచి, ఇవ్వకపోయినా పడుంటారులే అని భావించారాయన. మరణం ఎంత సెంటిమెంటును రగులుస్తుందో రాజకీయనాయకులకు ముఖ్యంగా చంద్రబాబుకు తెలుసున్నంతగా ఎవరికీ తెలీదు. ఇప్పుడు అఖిలకు పదవివ్వకపోతే, మున్ముందు గడ్డుస్థితి ఏర్పడే అవకాశముందని గ్రహించిన బాబు ఆమెను కరుణించారు. అలాగే, రావెల కిశోర్ బాబు, పీతల సుజాత, కిమిడి మృణాళిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకూ ఉద్వాసన పలికారు.
దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం విషయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని చక్రబంధంలో బంధించిన బాబుకు కేశినాని రూపంలో రవాణా రంగంలోనే మరో ఇబ్బంది ఎదురైంది. ఆరెంజ్ ట్రావెల్స్ వివాదంలో ప్రభుత్వానికి మచ్చ వచ్చేలా కనిపించింది. ప్రమాదాన్ని కనిపెట్టేసిన ముఖ్యమంత్రి అది ముదరకముందే కేశినేని నాని, బోండా ఉమామహేశ్వరరావులతో క్షమాపణ చెప్పించేసి, దానికి ముగింపు పలికారు. అయినప్పటికీ కేశినేని సమస్య ముగిసినట్లు కనిపించలేదు. కేశినేని ట్రావెల్స్‌ను మూసేస్తున్నట్లు ఆయన చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. ఇదే అదనుగా కేశినేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని కొందరూ, ఆయనకు ఆర్టీసీలో కొన్ని బస్సులను లీజు ప్రాతిపదికన ఇవ్వబోతున్నారని కొందరూ ప్రచారం ప్రారంభించారు.అందుకే కేశినేని ట్రావెల్స్‌ను మూసేశారని ప్రచారంలోకి తెచ్చారు. ఈ ప్రచారాలు చంద్రబాబులో సహజంగానే అనుమానాలను రేకెత్తించాయి. ఎవరి ఆర్థిక పరిస్థితి ఏమిటో చంద్రబాబుకు క్షుణ్ణంగా తెలుసు. ఆర్థికంగా బలంగా లేనివారు ఎన్నికల్లో పార్టీకి ఎక్కడ అక్కరకు వస్తారని ఆయన భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయన లగడపాటి రాజగోపాల్‌కు తలుపులు తెరిచారంటున్నారు. విజయవాడ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన రికార్డున్న లగడపాటిలాంటి వారి అవసరం చంద్రబాబుకు ఇప్పుడు ఎంతో ఉంది. 2019 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి చర్యలు తప్పనిసరి. ఈ చర్యలే 2019 ఎన్నికలకు చంద్రబాబు సన్నాహాలు మొదలు పెట్టేశారని చెబుతున్నాయి. ఆసక్తికరంగా భారతీయ జనతా పార్టీ కూడా భువనేశ్వర్‌లో ఎన్నికల సన్నాహాలను ప్రారంభించేసింది.
Subrahmanyam vs Kuchimanchi