నిర్ణయం ఏదైనా నాటకీయంగా ప్రకటించి సంచలన ప్రచారం పొందడం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. చేసిన పనిలో ఎంతోకొంత మంచి వున్నప్పుడు ప్రచారం ఎక్కువ చేసుకున్నా ఫర్వాలేదనుకోవచ్చు. రైతులకు ఎరువుల నిమిత్తం ఎకరాకు రు,4000 మేరకు బ్యాంకు ఖాతాలలో వేస్తామన్న నిర్ణయం ఆ కోవలో తాజాది. ఈ నాలుగేళ్లుగా రైతు రుణమాఫీ కింద ఏడాదికి నాలుగువేల కోట్లు కేటాయిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ మొత్తాన్నే ఎరువుల ఖాతాలో కొనసాగించాలన్నది ఇక్కడ ఆర్థిక సూత్రం. ఆ విధంగా చూస్తే దీన్ని నగదు బదిలీ అనాలి. పైగా ఇది చిన్న రైతులకే కాదు. ఎంత ఎక్కువ భూమి వుంటే అంత ఎక్కువ మొత్తం వస్తుంది. ఇదే సమయంలో ఉచిత విద్యుత్‌కు సంబంధించి కూడా గతంలో వున్న మూడెకరాల మెట్ట, రెండున్నర ఎకరాల మాగాణి పరిమితిని కెసిఆర్ సర్కారు ఎత్తివేసింది. బడాబాబుల పాంహౌస్లకు కూడా ఆ సదుపాయాన్ని విస్తరించింది. దేశంలోనే రైతుల ఆత్మహత్యల విషయంలో రెండవ స్థానంలో వున్న తెలంగాణ గ్రామీణ వాస్తవాన్ని ఇప్పటికైనా కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా అర్థం చేసుకుందా అంటే అనుమానమే. ఎందుకంటే రైతులను వేధిస్తున్న ప్రధాన సమస్య పరపతి లోపం, మార్కెట్లో దళారుల మాయాజాలం వంటివే. ఇప్పుడు దేశంలో చాలా చోట్ల క్వింటాల్ మిచ్చికి రు15 వేల నుంచి 20 వేల మరకూ రేటు వస్తుంటే తెలంగాణలోనూ ఎపిలోనూ 3 నుంచి 5 వేలు మాత్రమే వస్తుందనేది వాస్తవం. ఇది మారాలంటే మార్కెట్ జోక్యం పెరగాలి. దళారుల ఆటకట్టాలి. రైతులు నిల్వ చేసుకోవడానికి కోల్డ్‌స్టోరేజిలు పెంచాలి. కరువు నీటి కొరత కూడా తీవ్రంగానే వున్నాయి. ఈ నేపత్యంలో 4 వేలు ఇవ్వడం మంచిదైనా అదే పెద్ద వరప్రసాదంగా రక్షణ కవచంగా చెప్పడం అవాస్తవం. తెలంగాణ రైతాంగ దుస్థితిని తప్పించడానికి ఇదే మూలకూ సరిపోదు. కాకుంటే అధికారానికి వచ్చిన కొత్తలో రైతుల ఆత్మహత్యలపై పోచారం శ్రీనివాసరెడ్డి వంటివారు అవాకులు మాట్లాడిన పరిస్థితితో పోలిస్తే ఇది పెద్ద మార్పే. దీన్నే ప్రచారం చేసుకుంటూ సమయం గడపకుండా వ్యవసాయాన్ని రైతులను బతికించే సమగ్ర విధానం గురించి కసిఆర్ ఆలోచించాలి. ఇదొక్కదాంతోనే ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరివుతున్నాయని రైతులు ఉబ్బిపోతున్నారని అనుకుంటే అది అతిశయోక్తి మాత్రమే.