ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో వ్యూహాత్మకంగా సామాజిక లెక్కలతో చేశారన్న మంత్రివర్గ విస్తరణ ఎన్నడూ లేని స్థాయిలో అసంతృప్తిని పెంచడం తథ్యమని నేను మొదటే చెప్పాను. టీ కప్పులో తుపానులా చల్లారిపోయిందని పాలకపక్షీయులు కొందరు చెప్పారు. కాని ఇప్పుడు ఒక్కసారిగా వివిధ చోట్ల ప్రజ్వరిల్లుతున్న వివాదాలు చూస్తుంటే తెలుగుదేశం అంతర్గత పరిస్థితి నివురు కప్పిన నిప్పులానే వుందని తేలిపోయింది. కడపలో అదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి వివాదం , కర్నూలు జిల్లా నంద్యాలలో భూమా వర్సెస్ శిల్పా తగాదు(ఇందులో మళ్లీ శిల్పా సోదరుల సంవాదం) తిరుపతిలో ఎంపి శివప్రసాద్ బహిరంగ విమర్శలు,బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అసంతృప్తి, తూర్పు గోదావరిలో గోరంట్ల బుచ్చయ్య తిరుగుబాటు. ఇంకా పయ్యావుల కేశవ్, ధూలిపాళ్ల నరేంద్ర వంటి వారి నిర్వేదం, విజయవాడలో కేశినేని నాని, బోండా ఉమామహేశ్వరరావు వంటివారి చుట్టూ ఏదో రూపంలోసాగుతున్న సమస్యలు అన్నీ కలిపి అధిష్టానాన్ని అశాంతి పాలు చేస్తున్నాయి. ఒకరిని పిలిచి మందలిస్తే మరొకరు మంట పెడుతున్నారు. అందరికీ మాటలు చెప్పి బుజ్జగించినా లోలోపల మిగిలిన అసంతృప్తి ఇప్పుడు భగ్గుమంటున్నది. పెద్దగా బలం తగ్గని వైసీపీ దీన్ని ఉపయోగించుకోవడానికి ఎక్కడికక్కడ సిద్దంగానే వుంది. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ కాస్తా తగాదాల విస్తరణగా మారిందంటే బాధ్యత ముమ్మాటికీ ముఖ్యమంత్రిదేనంటున్నారు తెలుగు తమ్ముళ్లు.