ప్రస్తుతం సినిమా ప్రేక్షకుల కంట్రోల్ కి వెళ్ళిపోయిందని అభిప్రాయపడుతుంటారు కొందరు సినీ ప్రముఖులు. ”ప్రేక్షకులు ఇలాంటి సినిమానే చూస్తారు కాబట్టి అవే కొలతలతో కధలు వండాలి, అలాంటి సరుకుతోనే సినిమా తీయాలి” అనే ఓ అభిప్రాయం వుంది. కాని దీనికి భిన్నంగా వుండే ఫిలిం మేకర్స్ వున్నారు. ఇందులో మణిరత్నం ఒకరు. తను బలంగా నమ్మిందే తెరపై చూపించే దర్శకుడాయన. కమర్షియల్ కొలతలను లెక్కలోకి తీసుకోకుండా కమర్షియల్ విజయాలు అందుకున్న దర్శకుడు మణిరత్నం. అలాగే మణిరత్నం లాంటి అభిరుచి గల నిర్మాతలూ కనిపిస్తారు. ఇందులో దిల్ రాజు పేరు చెప్పుకోవాలి. మణిరత్నం సినిమా అంటే దిల్ రాజు ఇష్టం. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు కూడా ఎదురుకున్నారు దిల్ రాజు.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అమృత’ సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు దిల్ రాజు. విమర్శకుల ప్రసంశలు అందుకున్న సినిమా ఇది. కాని డబ్బులు రాలేదు. ఈ సినిమా దిల్ రాజుకు నష్టాల్ని మిగిలిమ్చింది. ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులు అందుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మాత్రం నిలబడలేకపోయింది. తర్వాత చాలా రోజులకు మణిరత్నం ‘ఓకే బంగారం’ ను తెలుగు లో విడుదల చేశాడు దిల్ రాజు. ఈ సినిమా ఆయనకు సేఫ్ ప్రాజెక్ట్ గా నిలిచింది. డబ్బులు కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఇష్టం నమ్మకంతో మణిరత్నం ‘చెలియా’ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు దిల్ రాజు. కాని ఫలితం మాత్రం ఊహించని విధంగా వచ్చింది. మణిరత్నం సినిమా అంటే విమర్శకులను తప్పకుండా మెప్పిస్తుంటుంది. కాని చెలియా విషయంలో అదీ జరగలేదు. టోటల్ గా సినిమా మిస్ ఫైర్ అయిపోయిందే రిపోర్ట్ వచ్చేసింది. దిల్ రాజు ఖాతాలో మరో డిజాస్టర్ చేరిపోయిన పరిస్థితి. మొత్తంమ్మీద ‘చెలియా’ దిల్ రాజుకు మరో అమృత అనుభవాన్ని మిగిల్చింది.