తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియా ముందుకు వస్తున్నారంటే చాలు.. టీడీపీ నేతలకు టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే, ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడేస్తారో ఎవ్వరికీ తెలీదు. సొంత పార్టీకే షాక్ లు ఇవ్వడం ఆయనకి అలవాటే. తాజాగా ఇలాంటిదే మరో ఝలక్ ఇచ్చారు. ఈసారి ముఖ్యమంత్రితో పాటు, మంత్రి నారాయణపై కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు.
తాజాగా మంత్రి నారాయణ కర్నూలుకి వచ్చారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో జేసీ ఆయన్ని కలుసుకున్నారు. మున్సిపల్ శాఖ సమస్యలపై మంత్రి సరిగా స్పందించడం లేదనీ, చాలా సమస్యల్ని గాలికి వదిలేస్తున్నారంటూ నారాయణ ముందే వ్యాఖ్యానించారు. దీంతో ఆయన.. అలాంటిదేం లేదనీ, ప్రస్తుతం తాను అన్ని సమస్యలపైనా దృష్టి పెడుతున్నాననీ, త్వరలోనే అన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భరోసా ఇచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ గురించి బయట ఇంకోలా మాట్లాడారు. రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకిగానీ, మంత్రి నారాయణకుగానీ ఏమాత్రం అవగాహన లేదని అన్నారట. ఈ మాట వినగానే ఆశ్చర్యపోవడం ఇతర టీడీపీ నేతల పనైంది.
దీంతో తాజాగా టీడీపీలో మరోసారి కలకలం రేపుతున్నాయి. ఇతర అంశాలపై జేసీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా టీడీపీ లైట్ తీసుకుంటోంది. ఆయన తీరు అంతే అని ఒక ముద్ర వేసేసి వదిలేశారు! కానీ, రాజధాని అమరావతిపై జేసీ ఇలా మాట్లాడటం టీడీపీలో గరంగరం చర్చకు దారి తీస్తోందని సమావేశం. నవ్యాంధ్ర రాజధాని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. జేసీ ఇలా ఎలా వ్యాఖ్యానిస్తారంటూ ఓ టీడీపీ నేత మండిపడ్డారట.
ఈ వ్యాఖ్యల్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారనీ సమాచారం. అయితే, జేసీని చంద్రబాబు వ్యక్తిగతంగా పిలిచి క్లాస్ తీసుకునే పరిస్థితి ఉందా అనేది అనుమానం! మరి, అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీగా తెలుగుదేశం గురించి చంద్రబాబు చెబుతూ ఉంటారు. జేసీ విషయంలో ఆ క్రమశిక్షణ ఏమౌతోందనేది అసలు ప్రశ్న..? ఇతర టీడీపీ నేతలపై అంత కమాండ్ ప్రదర్శించే చంద్రబాబు.. జేసీ విషయంలో మాత్రం ఎప్పుడూ సీరియస్ గా స్పందించింది లేదు. మరి, రాజధాని నిర్మాణంపైనా, ముఖ్యమంత్రి పనితీరుపైనా చేసిన వ్యాఖ్య కాబట్టి… ఈ విషయంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.