కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అనే దిశగా సాగుతున్నారు మన పొలిటీషియన్స్. ఇంతకుముందు అయితే చిన్న స్థాయి మనుషులు, బ్రోకర్లు చాలా మంది ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వ్యవహారాలన్నీ కూడా డైరెక్ట్ అయిపోయాయి. లంచం తీసుకోవడం అయినా…ఇవ్వడం అయినా డైరెక్ట్‌గానే చేసేస్తున్నారు. డైరెక్ట్‌గానే తేల్చుకుంటున్నారు. కోట్లాది రూపాయల అవినీతి వ్యవహారం ఎక్కడ బయటపడినా సరే…ఆ స్కాం చేసిన వాడు కచ్చితంగా ఎవరో ఒక బడా నాయకుడితో ఫొటోలు దిగే ఉంటాడు. ఆ ఫొటోలు దిగే కార్యక్రమం కూడా మీడియా సాక్షిగానే జరిగి ఉంటుంది. ఆ స్థాయికి చేరాయి మన నాయకుల అవినీతి వ్యవహరాలు. రేవంత్‌రెడ్డి కూడా అందుకే డైరెక్ట్‌గా సూట్ కేస్ పట్టుకుపోయి బేరం పెట్టేశాడు. అయినప్పటికీ ఆయనకు వచ్చిన నష్టం ఏం ఉంది? ఇంకాస్త క్రేజ్ పెరిగింది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో పదోన్నతి కూడా లభించింది.
ఇక లంచం ఇచ్చే విషయంలో కూడా మన నాయకులు ఆరితేరిపోయారు. ఆళ్ళకూ ఈళ్ళకూ ఎందుకు…డైరెక్ట్‌గా అసలు వాడికే లంచం సొమ్ము ఇచ్చేద్దాం అని ఆలోచిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, ఎన్నికల కమిషనర్….ఎవరైతే ఏంటి…డైరెక్ట్‌గా అసలు వాళ్ళతోనే బేరం పెట్టేందుకు వెనుకాడడం లేదు. దేశంలో దొంగలు ఎక్కువైపోయారన్న విషయం నాయకులకు మాత్రం తెలియకుండా ఉంటుందా? ఆ దొంగలకే దొంగల టైప్ వ్యవహారం కదా…చాలా మంది నాయకులది. అందుకే మధ్యలో వాళ్ళను కాకుండా అసలు వాళ్ళనే కొనేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య గాలిజనార్థన్‌రెడ్డి కూడా ఇదే ప్రయత్నం చేశాడు. చేసిన స్కాముల్లో బెయిల్ రావాలంటే హైకోర్ట్ న్యాయమూర్తిని కొనెయ్యడమే బెటర్ అని ఫిక్స్ అయ్యాడు. డబ్బు పంపకాలు కూడా స్టార్ట్ చేశాడు. కానీ కాలం కలిసిరాక అడ్డంగా దొరికిపోయి కొత్త స్కాములో ఇరుక్కున్నాడు. ఇప్పుడిక చిన్నమ్మ మేనల్లుడు టిటివి దినకరన్ కూడా గాలివారినే ఫాలో అయిపోయినట్టున్నాడు. అమ్మ సెంటిమెంట్‌తో పాటు రెండాకుల గుర్తు అంటే కూడా తమిళ ఓటర్లకు ఉన్న సెంటిమెంట్ గురించి బాగా తెలిసిన చిన్నమ్మ శశికళ…ఎలా అయినా ఆ గుర్తు మనకే వచ్చేలా చూడమని దినకరన్‌కి చెప్పినట్టుగా ఉంది. ఆయనగారు కూడా ఇంకేమీ ఆలోచించకుండా……ఆళ్ళనీ …ఈళ్ళనీ పట్టుకోండం కంటే డైరెక్ట్‌గా ఎన్నికల కమీషన్‌కే కమీషన్ కొడితే పనైపోతుందని చెప్పి గుడ్డిగా ముందుకుపోయాడు. ప్రస్తుతం చిన్నమ్మ టైం కూడా టూ బ్యాడ్‌గా ఉంది కదా…అందుకేగా సిఎం ఛెయిర్‌కి స్కెచ్ వేస్తే సెంట్రల్ జైల్‌కి పోవాల్సి వచ్చింది. ఇక్కడ కూడా టైం కలిసిరాలేదు. బుక్కయిపోయారు.
అయినప్పటికీ అవినీతి విషయంలో…లంచం ఇచ్చి పుచ్చుకోవడాల విషయంలో… రాజకీయాలు ఎంతగా అభివృద్ధి(?) చెందుతున్నాయి అన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. గాలి జనార్థన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, దినకరన్లాంటి వాళ్ళు ఇంకొంతమంది బయటపడితే చాలు……ఆ తర్వాత అవినీతి వ్యవహారాలన్నీ కూడా డైరెక్ట్‌గా బహిరంగ మార్కెట్లో సరుకులు కొన్న చందంగా మారిపోతాయనడంలో సందేహం లేదు. అఫ్కోర్స్…అప్పుడు కూడా నిప్పు, తప్పు, విలువలు, విశ్వసనీయత, అవినీతిని సమూలంగా నాశనం చేస్తాం….లాంటి డైలాగులు వినిపించడానికి మన నాయకులు ఏమీ సిగ్గుపడరనుకోండి. కాకపోతే బహిరంగ అవినీతి వ్యవహారాలు చూడలేని జనాలే సిగ్గుపడి…తలొంచుకుని తప్పుకుపోయే పరిస్థితులు అయితే మాత్రం కనుచూపుమేరలోనే కనిపిస్తున్నాయి.