కృష్ణా జిల్లా కలెక్టర్ బాబును బదిలీ చేశారు. కాదు..కాదు.. పదవినుంచి తప్పించారు. పోస్టింగు ఇవ్వకుండా నిలిపేశారు. కారణమేంటి. అందరి మదిలోనూ ఇంకా చెరిగిపోని దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదమేననేది అందరూ భావిస్తున్న కారణం. ఆ సమయంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని సమర్థంగా అడ్డుకోలేకపోయారని ముఖ్యమంత్రి భావించడమే దీనికి బాటలు వేసిందంటున్నారు. ఆ సమయంలో చంద్రబాబు కృష్ణా జిల్లా కలెక్టరు సమర్థతనూ, అనుభవాన్నీ ఆకాశానికెత్తేస్తూ మాట్లాడారు. ఒక జిల్లా మేజిస్ట్రేట్ మీద చేయి వేసి మాట్లాడతావా.. ఆయన్ను జైలుకు పంపిస్తానంటావా.. ఆయనెవరో అయన అధికారులెవరో నీకు తెలుసా.. ఆయన తలచుకుంటే నిన్నే జైల్లో కూర్చోబెడతాడని చంద్రబాబు విలేకరుల సమావేశంలో వైయస్ జగన్నుద్దేశించి మండిపడ్డారు. అంత సమర్థుడైతే కలెక్టర్ బాబుకు పోస్టింగు ఇవ్వకుండా ఎందుకు కూర్చోబెట్టారు. ఆయన సమర్థతకు తగిన పోస్టు కనిపించలేదా. సమర్థుడైన అధికారిని ఇలా ఖాళీగా ఉంచడం ఆయన్ను అవమానించడం కాదా. అదే సమయంలో రెవెన్యూ అధికారులంతా సమావేశమై కలెక్టర్ బాబుతో జగన్ వ్యవహారశైలిని తప్పుబట్టారు. తీవ్రంగా ఖండించారు. ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండూ చేశారు. ఇప్పుడా అధికారుల నోరు పెగలదేం. సమర్థుడైన అధికారిని ఖాళీగా కూర్చోబెట్టారని అడగరేం. నిజాయితీగల అధికారి వెంట ఉంటే ప్రజలూ సమర్థిస్తారు. లోక్ సత్తా జాతీయాధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఆయన్ను బదిలీ చేస్తే ప్రజల నుంచి నిరసన వెల్లువలా వచ్చింది. ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రజలు ఇదే మాదిరిగా ప్రతిస్పందించారు. విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వమే దిగొచ్చి, ఆయన్ను కొనసాగించింది. ఆయన ప్రజలకోసం పనిచేసిన కలెక్టర్. కానీ బాబు..పై ఆరోపణ ఏమిటి. జగన్‌ను నిరోధించలేకపోయారని. ఆయన్ను ఎవరు నిరోధించాలి. పోలీసులు ఆ పనిచేయాలి. అనుమతి లేదని చెప్పి ప్రతిపక్ష నేతను వెనక్కి పంపేసుండాలి. ఆ వైఫల్యం కలెక్టర్‌పై పడింది. అప్పటికప్పుడు బదిలీ చేసేస్తే.. మరో వివాదం తలెత్తుతుందని భావించి చంద్రబాబు గమ్మునున్నారనీ, ఇప్పుడు ఐఏఎస్‌ల బదిలీల్లో ఆయనపై వేటు వేశారంటున్నారు. అదే నిజమైతే, ఆరెంజ్ బస్ ట్రావెల్స్ వివాదంలో రవాణా శాఖ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యాన్నీ ఎందుకు తప్పించలేదు. అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో ఆయనకు క్షమాపణ చెప్పించినప్పటికీ, వివాదం తాలూకు గాయం ఇంకా పచ్చిగానే ఉంది. కేశినేని నాని తన ట్రావెల్స్‌ను మూసేయడం, తదుపరి తమకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళనకు దిగడం, తదితర కారణాల వల్ల వివాదం సద్దుమణగలేదు. అది ఓ కొలిక్కి వచ్చిన తరవాత రవాణా కమిషనరుకు కూడా బదిలీ తప్పదు. కొంచెం సమయం అంతే. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అనుభవానికి ఐఏఎస్‌ల తాజా బదిలీలు తార్కాణంగా నిలుస్తున్నాయి.నలుగురితో పాటు నారాయణ అన్నట్లు తమ దుగ్ధను తీర్చేసుకోవడం ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా చేసేది. అందరూ…..!!!
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి