వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి దిగుతోంది. ఇది కన్ఫర్మ్. కానీ, సోలోగా ఏ స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందీ అనేది మాత్రం ఇప్పట్లో చెప్పలేం. అయితే, 2014 ఎన్నికలు మాదిరిగానే మరోసారి తెలుగుదేశం పక్కన నిలుస్తారా..? భాజపాకి వంతపాడుతారా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే, టీడీపీ నేతలతోపాటు, భాజపాపై కూడా పవన్ తీవ్రస్థాయిలో విమర్శించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో భాజపా-టీడీపీ కూటిమి నుంచి పవన్ బయటకి వచ్చేశారనే చెప్పాలి. ఓవరాల్ గా.. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కీలకం అవుతారన్నది గ్యారంటీ. కాబట్టి, పవన్ సపోర్ట్ ఎవరికి ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను ఆకర్షించేందుకు ఏపీ భాజపా ప్రయత్నిస్తోందని అనిపిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే సోము వీర్రాజు వ్యాఖ్యల్లో అంతరార్థం అదే అని చెప్పాలి.
తమ పార్టీపై పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు సరైనవే అంటూ వెనకేసుకొచ్చారు సోము వీర్రాజు. అయితే, ఆ అభిప్రాయాన్ని త్వరలోనే మార్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా చేస్తున్న అభివృద్ధి చూసి, తమకే మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, పవన్ అనుసరిస్తున్న విధానాన్ని తాము ఫాలో అవుతూనే టీడీపీతో వ్యవహరిస్తున్నామని వీర్రాజు చెప్పడం విశేషం. ప్రభుత్వానికి సంబంధించి ఏ అంశాన్నైనా పవన్ కల్యాణ్ ప్రశ్నించవచ్చని అన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు తాము కూడా ఇదే వైఖరిని అవలంభిస్తామని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు జాగ్రత్తగా గమనిస్తే.. పవన్ కల్యాణ్ ను తమవైపు తిప్పుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోంది అనిపిస్తోంది. అంతేకాదు, ఇదే క్రమంలో భాజపా, జనసేన కలిసి టీడీపీపై పోరాటం చేస్తున్నట్టు చెప్పే ప్రయత్నం కనిపిస్తోంది. నిజానికి, భాజపాపై పవన్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, భాజపాను సానుకూల దృక్పథంతో ఎలా చూడాలో కూడా పవన్ కి వీర్రాజు సూచించారు.
మొత్తానికి, ఏపీ భాజపాకి పవన్ అవసరాన్ని చెప్పినట్టైంది! ఏపీలో భాజపా సొంతంగా ఎదగాలంటే ఉన్న ప్రతిబంధకం చంద్రబాబు అనేది ఓపెన్ సీక్రెట్. ఈ నేపథ్యంలో భాజపాకి జనసేన అండ దొరికితే.. వచ్చే ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించే అవకాశం కచ్చితంగా ఉంటుంది. అందుకే, ఇప్పటి నుంచే పవన్ ను దారిలోకి తెచ్చుకోవడం అనే స్కెచ్ లో భాగమే ఈ వ్యాఖ్యలు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు