తెరాస ఆవిర్భావ దినోత్సవ సంబరాలకు పార్టీ నుంచి సొమ్ము రాదన్నారు. ప్రభుత్వం ఇవ్వదన్నారు. జనసమీకరణకు పైసలు ఉండవన్నారు. నేతలూ కార్యకర్తలూ శ్రమించి, కూలి పనిచేసి సభకు రావాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారన్నారు. వినడానికి ఈ ఆలోచన ఎంతో బాగుంది అనుకున్నాం. ఒక కొత్త ఒరవడికి కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారని భావించాం. ఇకపై, జనసమీకరణకు సొమ్ము వెదజల్లడం తగ్గుతుందని ఆశించాం. కానీ, వాస్తవంలో జరుగుతున్నది ఏంటీ..? కూలి పని పేరుతో ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్నదేంటీ..?
ఒక సాధారణ వ్యక్తి కూలికి వెళ్తే రోజుకి ఎంతొస్తుంది..? మహా అయితే ఓ మూడువందలు. ఆవిర్భావ సభ కోసం తెరాస నేతలు కూడా కూలికి వెళ్తున్నారు కదా! వీరికి కూడా అంతే కూలి రావాలి కదా! కానీ, చిత్రంగా ఎమ్మెల్యులు ఎంపీలు కూలి చేస్తే వేలూ లక్షల రూపాయలు వస్తున్నాయి. బాన్సువాడ మార్కెట్ యార్డులో మంత్రి పోచారం శ్రీనివాస్ కూలి పని చేస్తే… రూ. 2 లక్షలు వచ్చాయి. ఒక పూట హమాలీగా పనిచేసినందుకు రైస్ మిల్లర్ల సంఘం ఇచ్చిన కూలీ అది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఏకంగా రూ. 7.5 లక్షలు సంపాదించారు. అది కూడా ఒక్కరోజు.. సారీ, ఒక్కపూట కూలి పనిచేసి! దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పత్తిమిల్లులో పనిచేసిందుకు లభించిన కూలీ.. జస్ట్ ఐదున్నర లక్షల రూపాయలు! మంత్రి జగదీష్ రెడ్డి బియ్యం బస్తాలు మోస్తూ రూ. 10 వేలు సంపాదించారు. ఇలా తెరాస నేతలు కూలి పనిచేస్తూ… చాలా కష్టపడి పార్టీ ఆవిర్భావ సభ కోసం రూపాయి రూపాయి.. ఛస్, వాళ్లకేం ఖర్మ.. వేలూ లక్షలూ పోగేస్తున్నారు.
అంతిమంగా జరుగుతున్నది ఏంటీ..? పార్టీ ఆవిర్భావ సభ పేరుతో భారీ ఎత్తున వసూళ్లు చేస్తున్నారు. తెరాస నేతలు కూలి పని చేస్తారంటే, సాధారణ కూలీలానే వేతనం తీసుకుంటారని… అలా వచ్చిన ప్రతీ రూపాయినీ సభ కోసం ఖర్చు చేసి ఆదర్శవంతంగా నిలుస్తారని అనుకున్నాం. కానీ, ఇక్కడ జరుగుతున్నది మళ్లీ అదే పాత తంతు. ఈ మాత్రం దానికి ఏదో చెమటోడ్చి సంపాదించేస్తున్నాం అనే బిల్డప్పులు ఎందుకు..? ఈ నాయకులు చేస్తున్న కాయకష్టం మీడియా స్టిల్స్ కు, ప్రచారానికీ తప్ప వేరే ఉపయోగం ఉందా..? పోనీ, వీరు సంపాదించిన లక్షలూ వేలతో పేదలకి ఉపయోగకరమైన పని చేస్తున్నారా..? పార్టీ ఉత్సవాల కోసం ఇంత హంగామా అవసరమా..? నాయకులు కూలి పనిచేయుట అనే ఈ మహత్కార్యం వల్ల ప్రచారార్భాటం తప్ప.. ప్రజలకు పనికొచ్చే అంశం ఏమైనా ఉందా చెప్పండీ..?