వైస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత నుంచీ ఎన్నికల ప్రచారం విషయంలో…అప్పటికే ఉన్న పార్టీలకు పోటీ ఇచ్చే విషయంలో జగన్ బాగానే సక్సెస్ అవుతున్నాడు. ఒక రకంగా ఉప ఎన్నికల విషయంలో తెలంగాణా సెంటిమెంట్‌ని నమ్ముకున్న కెసీఆర్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాడో జగన్ కూడా అదే స్థాయిలో సక్సెస్ అయ్యాడు. కానీ అసలు ఎన్నికలు వచ్చేసరికి కెసీఆర్లా విజేతగా నిలవలేకపోయాడు జగన్. పోల్ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబులాంటి అత్యంత అనుభవజ్ఙుడి తెలివితేటల ముందు జగన్ తేలిపోయాడు. అయినప్పటికీ తన లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నాలు మాత్రం జగన్ పెద్దగా చేస్తున్నట్టుగా కనిపించదు. టిడిపితో పోల్చితే వైకాపాకు ఉన్న ప్రధాన బలహీనత బూత్ స్థాయి కార్యకర్తలు సమర్థవంతంగా లేకపోవడం. వైఎస్సార్ సెంటిమెంట్ బలంగా ఉన్న రాయలసీమ, ప్రకాశం జిల్లాలో అస్థిత్వాన్ని నిలుపుకున్న వైకాపా…మిగిలిన చాలా జిల్లాల్లో మాత్రం కనీసం నిలబడలేకపోయింది. ఇక గోదావరి జిల్లాల గురించి అయితే చెప్పనవసరం లేదు. నాయకులే తప్ప బూత్ స్థాయి కార్యకర్తలకు చాలా కొరత ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టిడిపికి ఉన్న ప్రధాన బలం కార్యకర్తలే. టిడిపి ఉన్నంత స్థాయిలో నిబద్ధత కలిగిన కార్యకర్తలు మిగిలిన పార్టీలకు లేరు. టీఆర్ఎస్ పార్టీకంటే కూడా ఈ విషయంలో టిడిపికే బలం ఎక్కువ.
సరైన కార్యకర్తలను ఎంపిక చేసుకునే విషయంలో జగన్ కంటే కూడా జనసేనుడి ప్లానింగే బాగుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి డైరెక్ట్‌గా కార్యకర్తలతో టైం స్పెండ్ చేస్తే ఆ ఎనర్జీ మామూలుగా ఉండదు. ఈ రోజుల్లో అన్ని పార్టీలు, అందరు నాయకులు కూడా ఒకే తరహా వాగ్ధానాలు, ఒకే తరహా మోసాలు చేస్తున్న నేపథ్యంలో కనీసం కార్యకర్తలకు అయినా పార్టీపైన అభిమానం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. గతంలో అయితే చాలా సందర్భాల్లో నాయకులు మాత్రమే ఎక్కువగా జంప్ అవుతూ ఉండేవాళ్ళు. విలేజ్ పాలిటిక్స్, అభిమానాల పుణ్యమాని కార్యకర్తలు మాత్రం పార్టీలను తరచుగా మార్చడానికి ఎక్కువ మంది ఇష్టపడేవాళ్ళు కాదు. ఇప్పుడు విలేజ్‌లే వీక్ అయిన నేపథ్యంలో పార్టీ కండువాలు మార్చడమనేది కార్యకర్తలకు కూడా పెద్దగా మొహమాటంలేని వ్యవహారం అయిపోయింది. అలాగే గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను కూడా లాగేయడానికి అధికార పార్టీ నేతలు ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారు. ఉపాధి హామీ పథకం, పెన్షన్ వ్యవహారాలు, ఉచిత సరఫరాల విషయంలో మన-తన అంటూ విభేదాలు చూపిస్తూ అధికార పార్టీలో ఉన్నవాళ్ళకు మాత్రమే ఉచిత ఫలాలు అనేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా పార్టీని నమ్ముకుని ఉండి, పార్టీ కోసమే పనిచేసే స్థాయిలో కార్యకర్తలకు పార్టీపైన అభిమానం ఉండాలంటే అధినేతలు కచ్చితంగా కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఉన్నవాళ్ళలో నుంచి కాస్త గట్టివాళ్ళను ఎంపిక చేసుకుని ఎంకరేజ్ చేయాల్సిందే. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కార్యక్రమం బాగుంది. ప్రతిపక్ష నేత జగన్ కూడా కార్యకర్తల కోసం ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపడతాడేమో చూడాలి. టిడిపిని తలదన్నే స్థాయిలో కార్యకర్తల బలం ఉండాలంటే మాత్రం జగన్ కూడా కార్యకర్తల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిందే.