తెలుగునాట ఉన్న రాజకీయ నాయకులు చాలా మందికంటే కూడా ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గొప్ప రాజకీయ నాయకుడు. ‘రాజకీయం’ చేయడంలో రాధాకృష్ణది అందెవేసిన చేయి. వైకాపా నుంచి టిడిపిలోకి జంప్ చేసే అవకాశమున్న నేతలను జంప్ చేయకముందు, జంప్ చేసిన వెంటనే ఆ నేతలతో రాధాకృష్ణ చేసిన ఇంటర్యూలు చూస్తే ఆ నేతలకంటే కూడా రాజకీయ తెలివితేటల విషయంలో రాధాకృష్ణనే గొప్పగా కనిపిస్తాడు. ఇప్పుడు మరో విషయంలో కూడా గొప్ప విజయం సాధించాడు ఆర్కె.
2014 ఎన్నికల సమయానికి కెసీఆర్-చంద్రబాబులు బద్ధశతృవులు. ఆ నేపథ్యంలోనే బాబు భజన బృందంలో ప్రధాన సభ్యుడైన ఆర్కె కూడా కెసీఆర్‌కి శతృవు అయ్యాడు. అందుకే తప్పు చేసిన టివి9తో పాటు ఏ తప్పూ చేయని ఆంధ్రజ్యోతిని శిక్షించేశాడు కెసీఆర్. అఫ్కోర్స్ కెసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఉన్నదానికంటే కాస్త ఎక్కువ చేసి చూపే ప్రయత్నం అయితే చేశాడనుకోండి. కానీ అధికారంలో ఉన్న నాయకులందరూ కూడా….‘భజన మాత్రమే వినపడాలి…విమర్శలు వినిపిస్తే తొక్కెయ్యాలి’ అనే గొప్ప సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్న కాలం కనుక ఆంధ్రజ్యోతి కూడా నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ నిషేధం ఎపిసోడ్‌ని ఎంతలా హైలైట్ చేయాలో అంతా చేశాడు రాధాకృష్ణ. కెసీఆర్‌తో పోరాటానికే సిద్ధపడ్డాడు. బాబు-కెసీఆర్‌లు ఫైట్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి రాధాకృష్ణకు కూడా పోరు తప్పింది కాదు. కానీ ఒకసారి ఓటుకు కోట్లు కేసులో బుక్ అయ్యాక చాలా నైస్‌గా కెసీఆర్‌తో ఫ్రెండ్ అయిపోయాడు చంద్రబాబు. తెలంగాణాలో టిడిపిని ముంచేసి, సీమాంధ్రులకు పదేళ్ళ వరకూ హైదరాబాద్ తాత్కాలిక రాజధాని అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా బిచాణా ఎత్తేశాడు. ఆ వెంటనే రాధాకృష్ణ కూడా ‘రాజకీయ’ పావులు కదిపాడు. కట్ చేస్తే కెసీఆర్ భజన బృందంలో కూడా ప్రధాన సభ్యుడైపోయాడు. పోయిన వారం వీకెండ్ కామెంట్ బై ఆర్కె రచన అయితే బాబు గొప్పదనం గురించి చెప్పబోయి పొరపాటున కెసీఆర్ పేరు రాసేశాడా అన్న అనుమానం వచ్చేలా చేసింది. ఆ స్థాయి భజన తర్వాత మన నాయకులు ఖుషీ అవకుండా ఉంటారా? అందుకే కల్వకుంట్ల కుటుంబానికి ఇఫ్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక, రాధకృష్ణలు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. కాకపోతే నిర్మాణాత్మక ప్రతిపక్షం పాత్ర పోషించాల్సిన మీడియావాళ్ళు ‘రాజకీయం’ నేరుస్తూ….నాయకుల్లాగే కోట్లకు పడగలెత్తుతూ…రిటైరయ్యే టైంకి ఏ రాజ్యసభ మెంబర్గానో, ప్రభుత్వ సలహాదారులుగానో నియమితులవుతూ ఉండడం మాత్రం జర్నలిజం వృత్తిపట్ల ప్రజలకు ఉన్న గౌరవాన్ని పూర్తిగా చంపేస్తోంది. గతంలో జర్నలిస్ట్ అంటేనే జనంలో ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయ నాయకులను చూసినట్టుగానే జర్నలిస్టులను కూడా చూస్తూ ఉండడం దురదృష్టం. అయినా చేస్తున్న పనులను బట్టే కదా…..గౌరవం, అభిమానం దక్కుతాయి. ప్రజలను తప్పు పట్టడానికి మాత్రం ఏముంది?