సంగం డైరీయే మంత్రి దూళిపాళ నరేంద్రకు పదవి రాకుండా అడ్డంకిగా మారిందని చెప్పుకున్నదే. ఆయన తన ఇంటర్వ్యూలలో కూడా ఈ విషయాన్ని ఒకమేరకు ఒప్పుకున్నారు. తనతండ్రి వీరయ్య చౌదరికి ఎంతో ఇష్టమైన డైరీతో అనుబంధం వదలుకోలేనని, దేశంలో మొదటి ప్రైవేటు వెటర్నరీ కళాశాల స్థాపించేందుకే తమ ట్రస్టుకు స్థలం తీసుకున్న మాట నిజమేనని ఒప్పుకున్నారు. అయితే అంతకంటే పెద్ద సమస్య లోకేశ్ బాబు ఆధ్వర్యంలోని హెరిటేజ్‌తో వచ్చిన వివాదం అని ఇప్పుడు తెలుస్తున్నది. స్వంత జిల్లా చిత్తూరులో విజయడైరీని దెబ్బతీసిన తర్వాతనే చంద్రబాబు హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకున్నారనే విమర్శలున్నాయి. అలా అలా అది విస్తరించింది. ఇప్పుడు గుంటూరు జిల్లాలో సగం డైరీ సమర్థంగా పనిచేస్తుండడంతో హెరిటేజ్ పెద్దగా నిలదొక్కుకోలేకపోతున్నది. అందుకే దానికి తిరుగులేని అధినేతగా పట్టు నిలబెట్టుకుంటున్న నరేంద్రను కొంత వరకూ అవకాశమివ్వాలని లోకేశ్ ఒకటికి రెండుసార్లు సూచనగా చెప్పారట. చంద్రబాబు అంతకు ముందు నుంచి ఇతర కోణాల్లో కూడా చెబుతూనే వున్నారు. పార్టీ పదవులు ఏవి ఎలా వున్నా స్వంత పునాది సడలనివ్వకూడదనే వైఖరి నరేంద్రది. దాంతో ఆయన ఏది ఏమైనా అక్కడ మాత్రం తన మాటే నెగ్గాలన్న వైఖరి తీసుకున్నారు.ఇది సహించలేని టిడిపి నేతలు కొందరు ఆయనకు పదవి ఇవ్వద్దని ఒత్తిడి పెట్టారు. దీనికీ లోకేశ్ అండదండలున్నాయట. మొత్తానికి దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న నరేంద్రకు నిరాశే మిగిలింది.మరీ నేరుగా చిన్న బాసు హెరిటేజ్‌కు అడ్డుపడినందుకు ఆ మాత్రం పాఠం నేర్చుకోవద్దా అని ఆయన వ్యతిరేకులు ఆనందపడుతున్నారు.