తెలంగాణలో టిడిపి నాయకుల పరిస్థితి దారుణంగా వుందంటున్నారు. వారికి అద్యక్షుడు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ఎలాటి సహాయ సహకారాలు గాని సమయం గాని లభించడం లేదు.పోనీ మాకు స్వేచ్చ ఇవ్వండి అంటే అదీ లేదట. ఆర్థిక సహాయం లేక వ్యూహపరమైన సూచనలు లేక అనాసక్త నాయకత్వం ధోరణికి టిటిడిపి నేతలు ఆవేదనకు గురవుతున్నారు. టిఆర్‌ఎస్‌లో కలసిపోయిన వారు, రేవంత్ రెడ్డిలా దూకుడుగా వున్నవారు మినహా తక్కిన సీనియర్ సిన్సియర్ నేతలు బుర్ర పగలగొట్టుకుంటున్నారు. బిజెపి నేతలు తెలంగాణలో టిడిపితో పొత్తు వుండదని చెప్పేశారు. కాంగ్రెస్‌లో కలిసే అవకాశం వుండదు గనక టిఆర్‌ఎస్‌ను తిట్టితిట్టి వెళ్లలేము గనక ఎన్‌డిఎ ముసుగులో బిజెపి పేరిట పోటీ చేసే అవకాశమైనా ఇవ్వాలని టిటిడిపి నేతలు అడుగుతున్నారు.దానికి ఒప్పేసుకుంటే తెలంగాణలో వున్న టిడిపి యంత్రాంగం మొత్తం బిజెపికి సంక్రమిస్తుంది. అయితే చంద్రబాబు నోరు తెరిచిచెప్పకపోయినా సంకేతాలు అటే వున్నాయని కొందరు సీనియర్లు అంటున్నారు. కేంద్రంలోనైనా అధికారం వుంది గనక బిజెపితో వెళితే లాభపడతామన్న ఆలోచన వారికి వుంది. బిజెపి కూడా వారిపై బాగానే ఎరవేస్తున్నట్టు కనిపిస్తుంది. చివరకు అదే జరగొచ్చు. ముఖ్యమంత్రిగా ఎవరు ప్రకటిస్తే ఆ పార్టీలో వెళ్లాలనుకుంటున్న రేవంత్‌కు మాత్రం ఆ ఆహ్వానం ఎవరినుంచి రావడం జరిగేపని కాదు.