అజయ్ ఘోష్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఆయన చేసిన క్యారెక్టర్స్ గురించి కానీ, ఆయన యాక్టింగ్ గురించి కానీ ఏమైనా తెలుసా? అజయ్ ఘోష్ అనే ఆర్టిస్ట్ అనే ఒకరున్నారని ఎంతమందికి తెలుసు? కానీ ఆ సదరు అజయ్ ఘోష్ ఇవేవీ ఆలోచించినట్టు లేదు. వెరైటీ క్యారెక్టర్స్ చేసినప్పుడల్లా తెలుగు ప్రేక్షకులు తనను చాలా ఆదరించారన్న కమల్ హాసన్ మాటలు కూడా మనవాడికి తెలిసినట్టుగా లేవు. అలాగే విక్రమ్ విషయంలో కూడా అదే స్థాయిలో స్పందించింది మన మీడియా. కానీ ఈ అజయ్ ఘోష్ వ్యవహారం అంతా కూడా కొత్త సేద్యగాడిలా ఉంది. ఈయనను తెలుగు సినిమా ఇండస్ట్రీ గుర్తించలేదట. ఈయన ఆస్కార్ స్థాయి నటనను తెలుగు మీడియా పట్టించుకోలేదట…అలాగే ఇంకా చాలా మాటలు మాట్లాడేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కెమేరా ముందు కంటే కూడా కెమేరా వెనుకే ఎక్కువ నటిస్తారని కూడా కామెంట్ చేశాడు. మరి అదే వేదికపైన ఈయన యాక్టింగ్ చూస్తే మాత్రం…సినిమాల్లో కంటే ఇక్కడే బాగా యాక్ట్ చేస్తున్నాడే అని చాలా మందికి అనిపించింది. డ్రమెటిక్ హావభావాలతో ఆ స్థాయిలో తన భజన స్పీచ్‌ని రక్తికట్టించాడు మరి. తమిళ్లో ఏవో నాలుగు అవకాశాల కోసం చూస్తున్నాడు కాబట్టి తెలుగు మీడియాను, పరిశ్రమను తిట్టి… తమిళ పరిశ్రమను, తమిళ్ మీడియాను ఆకాశానికెత్తితే అవకాశాలు వస్తాయన్న భ్రమలతో భజన చేసేశాడు అని అనుకోవచ్చు. అఫ్కోర్స్ తెలుగును తిట్టకుండా కూడా తమిళ్‌ని పొగడొచ్చన్న జ్ఙానం మనవాడికి లేకుండా పోయింది.
అలాంటి అజయ్ ఘోష్ ఆ తర్వాత మాట్లాడిన మాటలు మాత్రం ఆక్షేపణీయం. తమిళ ప్రజలతో పోల్చి తెలుగు ప్రజలను కించపర్చడం మాత్రం నేరం. తమిళులను విమర్శిస్తూ ఇదే రకమైన వ్యాఖ్యలు ఎవరైనా సినిమా నటుడు చేసి ఉంటే రియాక్షన్ ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. కానీ తెలుగు వాళ్ళకు అంత ఉన్మాదం లేదు కాబట్టి మనవాడికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అయినా తమిళ ఇండస్ట్రీలో నాలుగు అవకాశాలు తెచ్చుకోవడం కోసం తెలుగు ప్రజలందరినీ తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? తమిళ ఆటోడ్రైవర్లు ఖాళీ టైంలో రాజకీయ వార్తలు చదువుతూ ఉంటారట, తెలుగు ఆటో డ్రైవర్లు మాత్రం పాన్ వేసి కబుర్లు చెప్పుకుంటారట. అలాగే తమిళ సాంబార్, తెలుగు సాంబార్‌ని పోలుస్తూ మనవాడు చేసిన వ్యాఖ్యలు అయితే అప్పుడెప్పుడో కెసీఆర్ చేసిన ఆంధ్ర బిర్యాని-తెలంగాణా బిర్యానీ వ్యాఖ్యలు గుర్తొచ్చాయి. కమ్యూనిస్టుని అని చెప్పి తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు కానీ మాటలన్నీ కూడా ఉద్యమ కాలంలో కెసీఆర్ చేసిన వ్యాఖ్యల్లానే ఉన్నాయి. అలాగే తమిళులతో తెలుగు వాళ్ళతో పోలుస్తూ ఇంకా చాలానే పేలాడు ఈ సినీ నటుడు. ఆయన మాటలన్నీ విన్న తర్వాత ఎవరికైనా అనిపించేది ఒక్కటే. పొట్టకూటి కోసం, నాలుగు డబ్బులు సంపాదించుకోవడం కోసం, నాలుగు అవకాశాల కోసం కోట్లాది మంది ప్రజలను కించపరిచేలా దిగజారుడు వ్యాఖ్యలు చేసే వాళ్ళకు వేరేవాళ్ళ తప్పొప్పుల గురించి మాట్లాడే అర్హత ఉంటుందా?