2009 ఎన్నికల ముందు వరకూ కూడా తెలుగు నాట రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎప్పుడూ వినిపించలేదు. ఆ ఎన్నికల్లో ఓ వైపు పూర్తి నమ్మకంతో దూసుకుపోతున్న వైఎస్సార్, మరోవైపు కొత్తగా రంగంలోకి దిగిన చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల ప్రచార హోరులో తన వాయిస్ కూడా జనాలకు వినిపించాలంటే చంద్రబాబుకు సీనియర్ ఎన్టీఆర్‌లాంటి ఒక నాయకుడి అవసరం పడింది. ప్రజాకర్షణ ఉండాలి, చెప్తున్న విషయం సూటిగా ప్రజల ఆలోచనల్లో నిక్షిప్తమయ్యేలా ఉండాలి, జనాలందరూ ఆ విషయం గురించి చర్చించుకునే స్థాయిలో మాట్లాడే శక్తి ఉన్న నాయకుడు కావాలి. చంద్రబాబుకు అంత సీన్ లేదన్న విషయం ఆయనకు తెలుసు. ఇక మాట్లాడిన ప్రతిసారీ సొంత పార్టీనే అడ్డంగా బుక్ చేస్తున్న లోకేషుడి తెలివితేటల గురించి కూడా చంద్రబాబుకు బాగానే అవగాహన ఉండి ఉంటుంది. ఎంతైనా మనుషులను అధ్యయనం చేయడంలో మాస్టర్ కదా. ఇక బహిరంగ సభల్లో బాలయ్య బాబు ప్రసంగాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చంద్రబాబును కూడా బ్రహ్మానందాన్ని చేయగల నేర్పు బాలయ్య సొంతం. అందుకే చంద్రబాబుకు ఎన్టీఆర్ అవసరం పడింది. తెలుగు దేశాన్ని స్థాపించిన ఎన్టీఆర్ శైలిలోనే ఖాకీ చొక్కా వేసుకుని రంగంలోకి దిగిన తారక్ అదరగొట్టాడు. మామూలుగా అయితే సినిమా వాళ్ళందరూ కూడా మేకప్ లేకుండా కనిపించడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఎన్టీఆర్ మాత్రం అవేవీ పట్టించుకోలేదు. తన ప్రసంగాలతో తాతను గుర్తు చెయ్యాలనుకున్నాడు. తాతకు తగ్గ మనవడు అనిపించుకోవాలని తపనపడ్డాడు. తెలుగుదేశం పార్టీ కోసం ఏ స్థాయిలో కష్టపడాలో అంతా కష్టపడ్డాడు. ప్రాణాల మీదకు తెచ్చిన యాక్సిడెంట్ తర్వాత కూడా స్ట్రెచర్ పై నుంచి ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్‌లు అయితే కొన్నేళ్ళపాటు జనాలకు గుర్తుండిపోయేలా చేశాయి.
2009 ఎన్నికల తర్వాత నుంచీ మాత్రం తన తప్పు ఏమీ లేకపోయినప్పటికీ ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్టీఆర్. ఏకంగా ముఖ్యమంత్రి అయిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు అనే స్థాయిలో ఎన్టీఆర్ పైన బురదచల్లారు. 2009కి ముందు ఎప్పుడూ రాజకీయ తెరపై కనిపించని ఎన్టీఆర్….2009 ఎన్నికల తర్వాత కూడా రాజకీయంగా పెద్దగా హల్చల్ చేయని ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కుర్చీని టార్గెట్ చేశాడు అని చెప్పి అబద్ధపు ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీని మళ్ళీ నందమూరి వారసుల చేతుల్లోకి తీసుకురావాలన్న ఆలోచన ఉంటే ఉండొచ్చు. అలాగే సినిమాలలో లాగే రాజకీయాల్లో కూడా తాత వారసత్వం దక్కించుకోవాలన్న ఆలోచన కూడా ఉంటే ఉండొచ్చు. అందులో తప్పేముంది? నారా లోకేషే ఎన్టీఆర్ మనవడిని అని ప్రొజెక్ట్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం కావాలని తారక్ కోరుకుంటే అందులో తప్పేముంది? నిజానికి తారక్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు కానీ టార్గెట్ చేసి విమర్శల వర్షం మాత్రం కురిపించారు. ఒక వర్గానికి, తెలుగు దేశం పార్టీకి ఎన్టీఆర్‌ని దూరం చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. ఇక ఇప్పుడు మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోనే ఎన్టీఆర్ రాజకీయ పార్టీ అంటూ ప్రచారం లేపారు. నవభారత్ నేషనల్ పార్టీ వాళ్ళను ఎన్టీఆర్ మనుషులు అప్రోచ్ అయ్యారని చెప్పి వార్తలు ప్రచురించారు. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ పేరు ఉన్న లెటర్ హెడ్‌ని సాక్ష్యంగా చూపించారు. ఎన్టీఆర్‌లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి గురించి వార్త ప్రచురించేటప్పుడు ఆయన అభిప్రాయం తీసుకోరా? అయినా ఇక్కడ అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఏముంది? ఒకవేళ పార్టీ స్థాపించి, రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే ఆ విషయం మీడియా వాళ్ళకు తెలియకుండా ఉంటుందా? కనీసం కామన్సెన్స్ ఉన్నవాళ్ళకు అయినా ఆ పార్టీ న్యూస్ అంతూ న్యూసెన్స్ అన్న విషయం అర్థమవుతుంది. అయినా ఎందుకు దుష్ప్రచారం చేశారు? రేపు ఇంకెవడో గోన గన్నయ్య నా పార్టీకి ఎన్టీఆరే అధ్యక్షుడు అంటే మళ్ళీ హంగామా మొదలెడతారా? ఎన్టీఆర్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎవరు టార్గెట్ చేస్తున్నారు? వేరే విషయాలేవీ పట్టించుకోకుండా తన కెరీర్, తన సినిమాల వ్యవహారం చూసుకుంటున్న ఎన్టీఆర్‌ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికుంది?