ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్.. ఇప్పుడు ఏపీ మంత్రి. ఆయన్ని మంత్రిగా చూడాలనీ, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా మారాలని ఎంతోమంది టీడీపీ నేతలు ఆశించిన సంగతి తెలిసిందే! తాజా విస్తరణలో ఆ నేతల కోరికలు తీరాయి. మంత్రి అయ్యాక నారా లోకేష్ ఏ తీరున పని చేస్తున్నారో, ఎంత చురుగ్గా ముందుకు సాగుతున్నారో, తనకు సంబంధం లేని శాఖల విషయంలో కూడా ఎంత చొరవగా వ్యవహరిస్తున్నారో అనేది మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఏదేమైనా, మంత్రి హోదాలో లోకేష్ ఎక్కడికి వెళ్లిన బ్రహ్మరథం పట్టేందుకు టీడీపీ కేడర్ సిద్ధంగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, మంత్రి అయ్యాక తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లిన లోకేష్ కి చుక్కెదురైంది..!
రాజకీయంగా తూర్పు గోదావరి జిల్లా ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. సో.. మంత్రి అయ్యాక ముఖ్యమంత్రి కుమారుడు జిల్లాకి వస్తున్నారంటే సహజంగానే స్థానిక నేతల హడావుడి కాస్త ఎక్కువగానే ఉంది. లోకేష్ వస్తున్నారంటూ జిల్లాకు చెందిన నాయకులందరూ రావడం అనేది రొటీన్ జరుగుతుంది. కానీ, లోకేష్ పర్యటనను సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పట్టించుకోలేదట! జిల్లాకు లోకేష్ వస్తున్నారని తెలిసినా కూడా చాలా లైట్ గా తీసుకున్నారు. ఇప్పుడీ అంశం పార్టీలో చర్చనీయంగా మారినట్టు సమాచారం.
ఇంతకీ.. ఆయన లోకేష్ పర్యటనకు రాకపోవడం వెనక కారణం.. చంద్రబాబు నాయుడుపై అసంతృప్తి వ్యక్తం చేయడమే! ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చాక బుచ్చయ్య చౌదరి స్పందించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడుకి సుదీర్ఘంగా ఒక లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ద్వారా బుజ్జగింపు ప్రయత్నాలు కూడా జరిగాయి. అయినా, బుచ్చయ్య చౌదరి ఆగ్రహం చల్లారలేదనే చెప్పాలి. చినబాబు పర్యటన సందర్భంగా దాన్ని మరోసారి ఇలా బయటపెట్టారని చెప్పాలి.
టీడీపీలో చాలా సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన అనుభవం ఆయనది. దీంతో తాజాగా టీడీపీలో చోటు చేసుకుంటున్న ఫిరాయింపు రాజకీయాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. సో.. అసంతృప్తి అంతా ఇలా నారా లోకేష్ పర్యటనపై పడిందన్నమాట.