తమిళ సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా విశాల్ అలా అడుగుపెట్టాడో లేదో.. సంచలన నిర్ణయాలు తీసేసుకొంటున్నాడు. ప్రతీ టికెట్టు పై ఓ రూపాయి రైతులకు వెళ్లాల్సిందే అనే నిర్ణయం తమిళ నాట హాట్ టాపిక్‌గా మారింది. ఒక్కసారిగా రైతులు, సామాన్యుల దృష్టిలో విశాల్ రియల్ హీరో అయిపోయాడు. నిర్మాతలు మాత్రం ”అసలే మేం కష్టాల్లో ఉంటే.. మళ్లీ ఇదొకటా?” అంటూ విశాల్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పుడు మరో షాక్ ఇచ్చాడు విశాల్. ఈసారి.. టీవీ ఛానళ్లను టార్గెట్ చేశాడు. ”మా పాటలూ, ట్రైలర్లు అప్పనంగా వాడుకోవడానికి వీల్లేదు. వాటికీ రేటు కట్టాల్సిందే” అంటూ హుకుం జారీ చేశాడు. దాంతో నిర్మాతలంతా ఇప్పుడు విశాల్ సైడ్‌కి వచ్చేశారు.
సినిమాకి సంబంధించిన ఎలాంటి అవుట్ పుట్ వాడుకొన్నా సరే, ఇక మీదట తమిళ ఛానళ్లు సరదు నిర్మాత దగ్గర అనుమతి తీసుకోవాల్సిందేనట. అందుకోసం ఎంతో కొంత మొత్తం కట్టాల్సిందేనట. ‘మా అవుట్ పుట్ వాడుకొని మీరు రేటింగులు సంపాదిస్తున్నారు. అందులో మేం కూడా వాటా అడిగితే తప్పేంటి’ అనేది విశాల్ వాదన. పైగా తమిళ నాట కొన్ని ఛానళ్లు పెత్తనం చెలాయిస్తున్నాయి. శాటిలైట్ రైట్స్ విషయంలో నిర్మాతల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాటిపై చెక్ పెట్టినట్టూ అవుతుంది, మరోవైపు నిర్మాతల మెప్పు పొందినట్టూ అవుతుంది కదా.. అందుకే విశాల్ ఇలాంటి నిర్ణయం తీసుకొన్నాడు. రజనీకాంత్, విజయ్ లాంటి పెద్ద హీరోల సినిమాల వరకూ అయితే… ఎదురు డబ్బులిచ్చి మరీ ట్రైలర్లు వేసుకొంటారు. కానీ చిన్న సినిమాల పరిస్థితేంటి? వాటికసలే ప్రమోషన్లు కరవైపోతున్నాయి. ఈ దశలో టీవీ ఛానళ్లు చిన్న సినిమాల్ని మరింత తొక్కేయవూ..? ఇదొక్క లాజిక్ విశాల్ మిస్సయిపోతున్నాడు. ఇది వరకూ తెలుగు నాట ఇలాంటి ప్రయత్నమే జరిగింది. ఛానళ్లను కంట్రోల్ చేయడానికి సరిగ్గా విశాల్లానే ఓ రూల్ పాస్ చేద్దామని చూశారు. కానీ నిర్మాతలంతా అడ్డుకోవడంతో అది వర్కవుట్ కాలేదు. మరి తమిళనాట ఈ నిర్ణయం ఏమాత్రం ప్రభావితం చేస్తుందో..!