భారత దేశ రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి రావడానికి అవసరమైన ఆయుధాలను అధికారంలో ఉన్నవారే ఇవ్వడం తరచుగా కనిపిస్తూ ఉంటుంది. సోనియా పుత్రరత్నం రాహుల్ బాబు కామెడీ, ఆ కామెడీ పొలిటీషియన్ రాహుల్‌ని వీరాధి వీరుడిగా, గొప్ప నాయకుడిగా ప్రజెంట్ చేయడం కోసం సోనియా గాంధీ పడ్డ తాపత్రయమే మోడీకి బంపర్ మెజారిటీ తెచ్చిపెట్టింది అనే విశ్లేషణను ఎవరైనా కాదనగలరా? అలాగే 2004 ముందు వరకూ భారతదేశంలోనే ప్రముఖ నాయకుడిగా ప్రచారం చేయించుకోవడంతో పాటు విజయవంతంగా అధికారంలో కొనసాగిన చంద్రబాబు రైతులను, గ్రామ సీమలను నిర్లక్ష్యం చేయడం, కెసీఆర్‌కి మంత్రి పదవి ఇవ్వకపోవడం లాంటి తప్పిదాలతోనే 2004 తర్వాత నుంచీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యేలా చేసింది. అప్పుడు వైఎస్, ఇప్పుడు కెసీఆర్‌లకు ముఖ్యమంత్రి పదవి యోగం పట్టడం వెనుక చంద్రబాబు వైఫల్యాలు కూడా బాగానే పనిచేశాయని చెప్పుకోవాలి.
ఇక ఇప్పుడు కెసీఆర్ కూడా అలాంటి తప్పులే చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇంకా అనేక రాష్ట్రాల్లో అప్పటి వరకూ అధికారంలో ఉన్న నాయకులు చేస్తున్న మైనారిటీ రాజకీయాలే బిజెపిని అధికారంలోకి వచ్చేలా చేస్తున్నాయి. అంటే మైనారిటీలకు ఏదో చేసేశారన్న భ్రమలు ఏమీ అవసరం లేదు. అలా చేసి ఉంటే ఆ మైనారిటీల ఓట్లు అయినా ఇతర పార్టీలకు గుంపగుత్తగా పడి ఉండాలిగా. అదే జరిగి ఉంటే బిజెపికి బంపర్ మెజార్టీలు ఎందుకు వస్తాయి? అయితే మైనారిటీలకు ఏదో చేస్తున్నామన్న భ్రమలు కల్పించడం కోసం బోలెడన్ని పబ్లిసిటీ స్టంట్స్ మాత్రం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కెసీఆర్ కూడా అదే చేస్తున్నాడు. అసలే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత నుంచీ తెలంగాణా రాష్ట్రంపైన అమిత్ షా కాస్త ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కెసీఆర్ చేస్తున్న మైనారిటీ రిజర్వేషన్స్ పబ్లిసిటీ స్టంట్ బిజెపికి మేలు చేసేలా కనిపిస్తోంది. అసెంబ్లీ స్థాయిలో హడావిడి చేసి ఫైనల్‌గా బిజెపిని దోషిగా నిలబెట్టాలన్నట్టుగా కెసీఆర్ వ్యూహరచన చేస్తున్నాడు కానీ ఆ వ్యూహం కంప్లీట్‌గా బూమరాంగ్ అయి కెసీఆర్‌నే దెబ్బకొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మైనారిటీల మెప్పు కోసం కెసీఆర్ పడుతున్న తాపత్రయాన్ని బిజెపి నేతలు బాగా హైలైట్ చేస్తున్నారు. ఒక వర్గానికి రిజర్వేషన్స్ కల్పించడం అంటే ఇతర వర్గాలకు అన్యాయం చేసినట్టు అనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఇప్పటికే ఈ రిజర్వేషన్స్ గోలేంట్రా బాబూ అని తిట్టుకుంటున్నవాళ్ళ సంఖ్య భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత వరకూ ఆ ఇష్యూని టచ్ చేయకుండా ఉంటేనే బాగుంటుందేమో. అలా కాకుండా కులాల ఓట్ల కోసం, మతాల ఓట్ల కోసం ఇంకా రిజర్వేషన్స్ పెంచుకుంటూ పోతామంటే మాత్రం మొదటికే మోసం జరగొచ్చు. ఈ ఇష్యూ అయితే బిజెపికి బాగానే కలిసొచ్చే అవకాశం ఉంది. కెసీఆర్ వ్యూహాలను ఎదుర్కునే స్థాయి నేత తెలంగాణాలో లేకపోవడమే కెసీఆర్ ప్రధాన బలం. కానీ అమిత్ షా కనుక రంగంలోకి దిగితే మాత్రం కెసీఆర్ జాగ్రత్తపడాల్సిందే. అలా కాకుండా గుడ్డిగా దూసుకెళ్తానంటే మాత్రం అవకాశాలను ఒడిసి పట్టుకోవడంలో ఆరితేరిపోయిన అమిత్ షా, మోడీల జోడీచేతిలో షాక్ తిన్న నాయకుల లిస్టులో కెసీఆర్ కూడా చేరిపోవడం ఖాయం.