చంద్రబాబు నాయుడు కొడుకుని, ఎన్టీఆర్ మనవడిని…రాజకీయాలు నా రక్తంలోనే ఉన్నాయి అని చెప్పుకునే లోకేష్ ప్రసంగాలు రోజు రోజుకూ కామెడీ అయిపోతున్నాయి. ఒకవైపు చంద్రబాబేమో స్కూల్ ఎడ్యుకేషన్ టైంలోనే నారా లోకేష్ తనకు రాజకీయ సలహాలిచ్చేశాడని చెప్తూ ఉంటాడు. మరోవైపు లోకేష్ మాత్రం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా కనీసం ప్రసంగాలలో తప్పులు లేకుండా మాత్రం జాగ్రత్తపడలేకపోతున్నాడు. మంత్రి అవ్వకముందు కూడా తన స్పీచ్‌లతో టిడిపిని ఇబ్బంది పెట్టిన లోకేష్ మంత్రి అయిన తర్వాత నుంచీ మాత్రం మరికాస్త జోరు పెంచేశాడు. రోజుకో తప్పిదం చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నాడు.
ప్రమాణ స్వీకారాన్ని కూడా స్పష్టంగా చేయలేకపోయిన లోకేష్….అంబేద్కర్ జయంతి నాడు మరోసారి స్లిప్ అయ్యాడు. ఇక నిన్న గోదావరి జిల్లాల్లో తాగునీటి సమస్య గురించి చెప్తూ పూర్తి రివర్స్ అర్థం వచ్చేలా మాట్లాడేశాడు. ఈ రోజు అనంతపురం పర్యటనకు వెళ్ళిన లోకేష్ అక్కడ జనాలకు కూడా షాక్ ఇచ్చాడు. షరా మామూలుగా వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబునే గెలిపించాలన్న జనాలకు పిలుపునిచ్చిన లోకేష్ ఎమ్మెల్యే సీట్ల విషయంలో మాత్రం 200 అనే ఫిగర్‌ని కోట్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. రాష్ట్రంలో ఉన్న రెండొందలకు రెండొందల సీట్లలోనూ టిడిపిని గెలిపించి చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చాడు లోకేష్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నదే 175 స్థానాలు అన్న విషయం తెలిసిందే. అలాంటప్పుడు ఈ 200 స్థానాల లెక్కేంటో లోకేషే చెప్పాలి. ఇంత వరకూ టంగ్ స్లిప్పులతో దొరికిపోయిన లోకేష్ ఈ సారి మాత్రం తన నాలెడ్జ్‌నే శంకించేలా మాట్లాడేశాడు. కనీసం అసెంబ్లీ స్థానాలు ఎన్నో కూడా తెలియని నాయకుడికి మంత్రిగా నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపైన ఏం అవగాహన ఉంటుందని ప్రశ్నించేలా చేసుకున్నాడు.