ఒక కొలిక్కి వచ్చేసిందనుకున్న శశికళా పన్నీర్ సెల్వీయం ఇంకా తెగని రాజకీయంలా సాగుతోంది. అన్నాడీఎంకే నేతలు తంబిదురై, జయకుమార్ నిన్న గవర్నర్ విద్యాసాగరరావును కలిసి, తాజా రాజకీయ పరిస్థితుల్ని వివరించడం.. ఇంకా ఏదో జరుగుతోందని సూచిస్తోంది. శశికళనూ, ఆమె మేనల్లుడు దినకరన్‌నూ పార్టీ పదవుల్నించి బహిష్కరించాలనీ, గతంలో వారిని పార్టీ నేతలుగా పేర్కొంటూ ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకోవాలనీ పన్నీర్ సెల్వం వర్గం పట్టుబడుతోంది. మొత్తం 30మందిని పార్టీ నుంచి దూరంగా ఉంచాలని కోరుతోంది. దీనితో పాటు పన్నీర్ సెల్వంకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలని కూడా కోరుతున్నారు. దీనితో పాటు జయలలిత మరణంపై విచారణ చేపట్టేందుకు అంగీకరించడంతో పాటు, ఆమె ఇంటిని స్మారక నిలయంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
వీటి వెనుక పార్టీని మన్నార్ గుడి మాఫియా చేతుల్లోంచి తప్పించాలనే ప్రధాన ఉద్దేశం కనిపిస్తోంది. కుటుంబ పాలనకు చోటివ్వరాదనే తపన కూడా పార్టీలో అత్యధిక సంఖ్యాకుల్లో వ్యక్తమవుతోంది. పన్నీర్ సెల్వం తిరుగుబాటు అనంతరం, తమను బలవంతంగా నిర్బంధించిన తీరును ఎమ్మెల్యేలు మరువలేకపోతున్నారు. వారిలో అత్యధికులు ప్రస్తుత పరిణామాలను ప్రతీకారం తీర్చుకోవడానికి ఉపయోగించుకోవడానికా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ తమిళ రాజకీయాలన్ని తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని ఉవ్విళ్లూరుతుండడం కూడా పరిస్థితి క్లిష్టతరమవుతుండడానికి కారణం. తాజా పరిణాలపై డీఎంకే వేడుక చూస్తోంది. జయలలిత మరణానంతరం రాజకీయ సుస్థిరతకు దూరమైన తమిళనాడు జల్లికట్టు, కావేరీ జలాల ఉద్యమాలతో అట్టుడికింది. సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి యత్నిస్తూనే సమస్యల పంకిలమైన జలాల నుంచి స్వచ్ఛంగా ఉద్భవించే కమలంలా ఉదయించడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అన్నాడీఎంకే, డీఎంకే అనే రెండు పార్టీలు మాత్రమే ఇప్పటివరకూ తమిళనాడును ఏలుతూ వస్తున్నాయి. తాజా రాజకీయ విపరిణామాలు మూడో పార్టీకి చోటిస్తాయా..లేక అన్నా డీఎంకేను చీలికలు చేసి, తనలో కలిపేసుకుని బలీయంగా బీజేపీ తయారవుతుందా అనే అంశాన్ని కాలమే నిర్ణయించాలి.
Subrahmanyam Vs Kuchimanchi