బాహుబలి 2 అద్భుతాల్ని వెండి తెరపై కళ్లారా చూడాలని సినీ అభిమానులంతా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. బాహుబలి 2లో ఏం ఉండబోతున్నాయి? ఈసారి రాజమౌళి ఏ స్థాయిలో విజువల్ వండర్ చూపించబోతున్నాడు… అంటూ ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. బాహుబలి 2కి సంబంధించిన ఒక్కో సీక్రెట్ బయటకు వస్తూనే ఉంది. బాహుబలి 2లో ఏనుగుల ఫైట్ ఓ అద్భుతమని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మాహీష్మతీ రాజ్యంలో దీపాల పండుగు జరుగుతున్నప్పుడు శత్రు మూక.. ఓ ఏనుగుల గుంపుని వదులుతార్ట. ఆ మదపుటేనుగుల్ని అడ్డుకోవడం కోసం ప్రభాస్, రానాలు బరిలో దిగుతారట. ప్రభాస్ ఏనుగు తొండంపై నిలబడినట్టున్న పోస్టర్ వెనుక కథ ఇదీ!
ఈ పోరాట ఘట్టం ఒక్కటే 4 నిమిషాల వరకూ ఉందని తెలుస్తోంది. ఏనుగుతో పాటు ఈ సినిమాలో రకరకాలైన వింత జంతువులు కనిపించబోతున్నాయట. కళా దర్శకుడు సాబూ సిరెల్ ఈ సినిమా ద్వారా ఓ కొత్త సృష్టి చేశాడని విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు కమల్ కణ్ణన్ చెబుతున్నారు. యానిమేటెడ్ జంతువులెన్నో ఈ సినిమాలో కనిపించబోతున్నాయని, ఓ రంగుల ప్రపంచం కళ్ళముందు సాక్ష్యాత్కరించడానికి రాజమౌళి అండ్ టీమ్ విశేషంగా కృషి చేసిందని కణ్ణన్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం ఏకంగా 2226 గ్రాఫిక్స్ షాట్స్ వాడార్ట. ఈ స్థాయిలో గ్రాఫిక్స్ వాడడం తెలుగు సినిమాల్లో ఇదే తొలిసారి.