కావేరీ జలాల వివాదంలో తల దూర్చి కన్నడీగుల మనసు నొప్పించాడు కట్టప్ప సత్యరాజ్. ఆయనపై కోసం బాహుబలి 2పై చూపించడం మొదలెట్టారు కర్నాటక వాసులు. బాహుబలి 2ని తమ రాష్ట్రంలో విడుదల కానివ్వం అంటూ పట్టుపట్టారు. బాహుబలి 2కీ, కావేరీ జాలాలకూ సంబంధం ఏమిటి?? దయచేసి బాహుబలి 2 విడుదలకు అడ్డుతగలొద్దు అంటూ స్వయంగా రాజమౌళి వేడుకొన్న సంగతి తెలిసిందే. అయినా… కన్నడీగుల కోపం చల్లారలేదు. దాంతో ఇప్పుడు సత్యరాజే స్వయంగా రంగంలోకి దిగాడు. కర్నాటక ప్రజలకు క్షమాపణ చెప్పాడు. బాహుబలి 2ని అడ్డుకోవొద్దని వేడుకొన్నాడు. మరి ఇప్పుడైనా బాహుబలి 2 కి లైన్ క్లియర్ అవుతుందేమో చూడాలి.
నిజానికి కావేరీ జాలలపై నటీనటులు, రాజకీయ నాయకులు పెదవి విప్పడానికి జంకు తున్నారు. ఏం మాట్లాడితే, ఏం అవుతుందో అనేది వాళ్ల భయం. అయితే సత్యరాజ్ మాత్రం నిర్మొహమాటంగా తన అభిప్రాయం వెల్లడించారు. అయితే ఆ ఎఫెక్ట్ బాహుబలి 2పై పడుతుందని అస్సలు ఊహించలేదు. ఈ సినిమాని కర్నాటకలో దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇప్పుడు బాహుబలి అక్కడ విడుదల కాకపోతే.. బయ్యర్లు నిండా మునగాల్సిందే. అందుకే రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగాల్సివచ్చింది. కట్టప్పతో క్షమాపణలు చెప్పించిందీ రాజమౌళినే అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.