ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు వస్తే అత్యంత ఎక్కువగా ఆనందించే వ్యక్తి ఎవరు? ఆ రాష్ట్ర ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డినే అని ప్రత్యేకంగా చెప్పాలా? మామూలుగా అయితే ఎవరైనా గుడ్ న్యూస్ చెప్తే వాడి నోట్లో పంచదార పోయిండ్రా అని అనడం మన సాంప్రదాయం. ఆ యాంగిల్లో ఆలోచిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..జగన్ నోట్లో ఏకంగా అమృతమే పోసినట్టు లెక్క. అతి త్వరలోనే ఎన్నికలు వస్తాయని చంద్రబాబే స్వయంగా చెప్పాడు. టిడిపి నేతలు, కార్యకర్తలను ఎన్నికలకు రెడీ అవ్వమని చెప్పాడు. రెండేళ్ళ తర్వాత నేనే సిఎం అని చెప్పుకుంటున్న జగన్‌కి ఇంతకంటే సంతోషకరమైన వార్త ఇంకేముంటుంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితే వస్తే జగన్ పార్టీ నేతలందరూ కూడా ఆనందించాల్సిన విషయమే.
ఇంకో రెండేళ్ళ పాటు కూడా ప్రతిపక్షంలో ఉంటూ గవర్నమెంట్ పెట్టే బాధలను ఎలా తట్టుకోవాలా అని ఆలోచిస్తున్న వైకాపా నేతలకు ఇది నిజంగా గుడ్ న్యూసే. అలాగే 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన అసాధ్యమైన హామీలలో ఒక్కటి కూడా నెరవేరకపోవడం, అలాగే మోడీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ బుట్టదాఖలు, కావడం, పవన్ కళ్యాన్ జనసేన పార్టీ ఇంకా రూపురేఖలు సంతరించుకోకపోవడం లాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావడమే జగన్ పార్టీకి మంచిది అని చెప్పుకొవచ్చు. అలాగే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం కూడా ఉండదు కాబట్టి అది కూడా ప్రతిపక్ష పార్టీకి కలిసొచ్చే అంశమే. అతి త్వరలోనే ఎన్నికలు అన్న చంద్రబాబు మాటకు చంద్రబాబు అర్థం ఏంటో తెలియదు కానీ అదే జరిగితే మాత్రం జగన్ ఆనందపడాల్సిన విషయమే. అయినా ఇంకా రెండేళ్ళకు పైగానే ఎన్నికలకు సమయం ఉండగా ఇఫ్పుడే చంద్రబాబు ఎన్నికల పాట పాడడం వెనకాల ఆంతర్యం ఏంటో? చంద్రబాబు ఏం చేసినా, ఏం మాట్లాడినా దాని వెనకాల భారీ వ్యూహం ఉంటుంది. వైకాపా పార్టీని స్థాపించినప్పటి నుంచీ ఇప్పటి వరకూ కూడా రాజకీయ వ్యూహాల విషయంలో మాత్రం చంద్రబాబు చేతిలో ప్రతిసారీ ఓడిపోతూనే ఉన్నాడు జగన్. 2014లో కూడా గెలుస్తానన్న అతి విశ్వాసంతో మొండిగా దూసుకెళ్ళి బొక్కబోర్లా పడ్డాడు. ఈ సారి ఎన్నికలు ముందుగా వచ్చాయన్న అత్యుత్సాహంతో ఆవేశపడిపోయి దెబ్బతినడన్న గ్యారేంటీ ఏమీలేదు. అదే జరిగితే మాత్రం జగన్ కుర్చీ ఆశలు అంతటితో సరి అని చెప్పుకోవచ్చు.